ఇదేం తీరు..!

– మహిళా న్యాయవాది పట్ల కర్నాటక హైకోర్టు జడ్జి అభ్యంతరకర వ్యాఖ్యలు
– సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి న్యాయస్థానంలో మహిళా న్యాయవాదిని ఉద్దేశించి అవమానకరంగా చేసిన వ్యాఖ్యల వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం, సోషల్‌ మీడియాలో వచ్చిన క్లిప్‌ను పరిగణనలోకి తీసుకుంది. కోర్టు కార్యకలాపాల సందర్భంగా ఒక మహిళా న్యాయవాదిని ఉద్దేశించి బహిరంగ న్యాయస్థానంలో హైకోర్టు న్యాయమూర్తి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఇది ఆన్‌లైన్‌లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను సంప్రదించి రెండు రోజుల్లోగా నివేదికను ఇవ్వాల్సిందిగా బెంచ్‌ కర్నాటకక హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ నెల 25కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఈ న్యాయమూర్తిపై చర్య తీసుకోవాలని, మహిళల గురించి సున్నితంగా ఆలోచించేలా శిక్షణ ఇప్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నట్లు సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. గతంలో కూడా ఈ న్యాయమూర్తి తన నోటి దురుసుతో ప్రజాగ్రహానికి గురయ్యారు.