‘అధికారానికి వచ్చిన 24గంటల్లోనే ఉక్రెయిన్ సమస్యను పరిష్కరిస్తా’నన్నాడు డోనాల్డ్ ట్రంప్, కావాలంటే దానికంటే ముందే కూడా చేస్తానని కూడా సెలవిచ్చాడు. ఒక్కరోజులో కాదులే గానీ కనీసం వందరోజులు పడుతుందన్నాడు ఉక్రెయిన్ రాయబారిగా ట్రంప్ ఎంచుకున్న కెయిత్ కెలోగ్. వంద రోజులా? చెప్పటానికి బాగానే ఉంటుంది గానీ, అంత తేలిగ్గా ఎలా కుదురుతుంది? కొన్ని నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చునని ట్రంప్ సలహాదారులు చెప్పినట్లు రాయిటర్స్ తాజా కథనం.ఈ తీరు చూసినపుడు ‘ఇంతన్నాడంతన్నాడే గంగరాజు నన్నొగ్గేసెల్పోనాడే గంగరాజు’ అన్నట్టుగా ఉక్రెయిన్ పరిస్థితి తయారైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్నో కబుర్లు వల్లించిన పెద్దమనిషి నోట ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే మాటలో తేడా వచ్చింది. అప్పు రేపు అని గోడమీద రాసినట్లుగా ” పరిష్కరిస్తా” అని మాత్రమే మాట్లాడుతున్నాడు. గాజాలో దాడులకు స్వస్తి పలకటం కంటే ఉక్రెయిన్ పోరు ముగించటం కష్టంగా కనిపిస్తోందని ఒక సందర్భంగా చెప్పాడు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ట్రంప్.పైకి ఎన్ని బింకాలను ప్రదర్శించినా ఏదో విధంగా రాజీచేసి పరువు దక్కించమని పశ్చిమ దేశాలను జెలెన్‌స్కీ వేడుకుంటున్నాడన్నది స్పష్టం. ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాడు 1,057వ రోజులోకి ప్రవేశించింది. బుధవారం నాడు రష్యా ప్రయోగించిన 40 క్షిపణులు, 70డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ గ్యాస్ మౌలిక సదుపాయాలతో సహా విద్యుత్ సర ఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైందని వార్తలు. అయితే ముందు జాగ్రత్త చర్యగా తామే అనేక ప్రాంతాల్లో కోతలు విధించినట్లు జెలెన్‌స్కీ యంత్రాంగం చెప్పుకుంది.
తమ భద్రతకు పనామా కాలువను, గ్రీన్‌లాండ్ ప్రాంతాన్ని అప్పగించాలని, కెనడాను విలీనం చేయాలని డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను రష్యా తనకు అనువుగా మలుచుకొంటోంది. రాజీ కుదిరితే స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ ప్రాంతాలను అప్పగిస్తారా? అన్న ప్రశ్నకు అసలు దాని గురించి చర్చలకు కూడా ఆస్కారం లేదని పుతిన్ సహాయకుడు నికోలారు పత్రుషెవ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ట్రంప్ కొన్ని ప్రాంతాలు కావాలని కోరుకుంటున్నట్లే తమకూ ఉక్రెయిన్లో కొంత ప్రాంతం అవసరమే కదా అన్నట్లుగా పోలిక తెచ్చాడు. తమ దేశ భద్రతకు హామీగా నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకో కూడదన్న వినతిని పెడచెవిన పెట్టిన తరువాతే రష్యా 2022 ఫిబ్రవరి 24 నుంచి మిలిటరీ చర్య జరుపుతున్నది. ట్రంప్ ప్రకటన తరువాత దానికి మరింత బలం చేకూరుతున్నది. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచ పటాన్ని తిరిగి గీస్తున్నది, అందులో భాగంగానే అనేక దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని పత్రుషెవ్ చెప్పాడు.ఉక్రెయిన్, ఐరోపా యూనియన్‌తో నిమిత్తం లేకుండా ముందుగా అమెరికా-రష్యాలు ఒక ఒప్పందానికి రావాలని అన్నాడు.చర్చలకు ప్రత్యేక పరిస్థితులేమీ అవసరం లేదని పుతిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పాడు.దీని అర్ధం సైనిక చర్యను తాత్కాలికంగా కూడా నిలిపివేసేది లేదని చెప్పటమే.
డోనాల్డ్ ట్రంప్ ఒక రాజకీయవేత్తగా ఓట్ల కోసం లేదా స్వభావసిద్ధ్దంగానే వదరుబోతు కావచ్చు,కానీ అమెరికా పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగానే అంతిమంగా వ్యవహరిస్తాడు. ‘నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా’ అన్నట్లుగా పుతిన్ ఉన్నాడు. ట్రంప్‌తో చర్చలకు తాము సముఖమే గానీ ఆయన సలహాదారులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలు కొన్ని కుదిరేవి కాదని రష్యా చెబుతున్నది. సంక్షోభ ముగింపు కొన్ని నెలలు పట్టవచ్చన్న సలహాదారుల వ్యాఖ్యలపై మాస్కో మౌనం పాటించింది. యుద్ధం కొనసాగిన కొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందనే మనో భావాలను ట్రంప్ రెచ్చగొట్టవచ్చు, దాని వలలో కొందరు పడవచ్చు గానీ సంక్షోభం ఎంత దీర్ఘకాలం కొనసాగితే అమెరికా ఆయుధ పరిశ్రమలకు లాభాలు, కొంత మందికి ఉపాధి, రష్యా ఇంధన మార్కెట్‌ను అమెరికా కంపెనీలు ఆక్రమించి లాభాలు పిండుకుంటాయి. అందుకనే ఏదో ఒకసాకు చూపి ట్రంప్ కూడా జో బైడెన్ బూట్లలో కాళ్లు దూర్చి నడిచేందుకే చూస్తాడు. ఐరోపాలోని అగ్రరాజ్యాలకు రష్యా బలహీనం కావటం అవసరం. అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని భావిస్తున్నారు.నాటో కూటమి దేశాల ఉద్దేశ్యాలను గ్రహించి కావచ్చు, తొలి రోజుల మాదిరి రష్యా ఇప్పుడు దూకుడుగా ముందుకు పోవటం లేదు, నిదానంగా అడుగులు వేస్తున్నది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల చెలగాటం మనవంటి తృతీయ ప్రపంచ సమాజాలకు ప్రాణసంకటంగా మారుతోంది.