ఇది అన్యాయం!

ఇది అన్యాయం!– వివాదాస్పద గోల్‌పై ఫిఫాకు ఫిర్యాదు
న్యూఢిల్లీ : క్రీడాస్ఫూర్తితో పాటు ఆట నిబంధనలను తుంగలో తొక్కుతూ ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో భారత్‌పై ఖతార్‌ విజయం సాధించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ప్రపంచ సాకర్‌ అభిమానులు సంబంధిత గోల్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఫిఫాకు ట్యాగ్‌ చేస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్‌ 2026 అర్హత ప్రక్రియ ఆసియా జోన్‌లో మూడో రౌండ్‌కు చేరేందుకు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చెందింది. కానీ ఆ మ్యాచ్‌లో గోల్‌లైన్‌కు ఆవల వెళ్లిన బంతిని మళ్లీ అందుకుని గోల్‌ చేయటం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ)కు లేఖ రాసింది. ‘ఖతార్‌తో మ్యాచ్‌ ఓడిన తీరు భారత ఫుట్‌బాల్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆటలో గెలుపోటములు సహజం. క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యం. భారత్‌కు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని ఫిఫాకు రాసిన లేఖలో ఏఐఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది.