నీతో ఈ గడిచిన కాలం..

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌లో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహా నిర్మాత. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘కనుల చాటు మేఘమా’ పాట, టైటిల్‌ సాంగ్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. గురువారం సాయంత్రం మేకర్స్‌ విడుదల చేసిన ‘నీతో ఈ గడిచిన కాలం’ అనే పాట ‘కనుల చాటు మేఘమా’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్‌ సాంగ్‌ తరహాలోనే వినసొంపుగా, వినగానే నచ్చేలా ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలలోని మెలోడీ పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో.. ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట అంతకుమించి అనేలా ఉన్నాయి. మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్‌ది ప్రత్యేక శైలి అని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్‌ అద్భుతమైన సాహిత్యం అందించారు.