ఈ గుర్తింపు మరింత బాధ్యతని పెంచింది

This recognition brought more responsibility”పుష్ప 2- టైటిల్‌ సాంగ్‌, జాతర పాటకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాదు నా కెరీర్‌లో మైల్‌ స్టోన్‌గా నిలిచిపోతుంది’ అని కొరియో గ్రాఫర్‌ విజయ్‌ పోలాకి అన్నారు. రీసెంట్‌గా ఆయన కొరియోగ్రఫీ చేసిన ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌, జాతర పాటలు టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచిన నేపథ్యంలో శనివారం మీడియాతో సంభాషించారు.
– ఈ మధ్య కాలంలో ఏ కొరియోగ్రాఫర్‌కి రాని గుర్తింపు నాకు రావడం, అలాగే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ కొరియో గ్రాఫర్‌గా వైరల్‌ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఏ సాంగ్‌ వచ్చిన బెస్ట్‌ ఇవ్వాలనే బాధ్యతని ఈ గుర్తింపు మరింత పెంచింది.
– మాస్టర్‌ అవ్వాలనే ఆలోచన హీరో రామ్‌ వల్లే వచ్చింది. నా వీడియోస్‌ చూసి, డెమోస్‌ చేసి చూపించమన్నారు. నా డెమోస్‌ చూసి కార్డ్‌ ఉందా అని అడిగారు. నేనూ కార్డ్‌ తీసుకోవచ్చు, నేనూ మాస్టర్‌ కావచ్చనే ఆలోచన ఆయన ప్రోత్సాహంతోనే మొదలైంది. 2015లో డ్యాన్సర్‌ కార్డ్‌ తీసుకున్నాను. డ్యాన్సర్‌గా చేశాను. తర్వాత మాస్టర్‌ అయ్యాను. నేను కొరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్‌ ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆ ఇఈ..’. తర్వాత పలాసలో అన్ని పాటలు చేశాను.
– అందులో ‘నక్కిలీసు గొలుసు..’ పాట వైరల్‌ హిట్‌ అయ్యింది. తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ ‘పుష్ప’ సినిమా అవకాశం వచ్చింది. ‘ఊ అంటావా మామ’ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశాను. ఈ పాట బాగా హిట్‌ అవ్వడంతో ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.
– ‘పుష్ప 2’ కోసం సుకుమార్‌ నుంచి కాల్‌ వచ్చింది. అసలు ఇది నేను ఊహించలేదు. సుకుమార్‌ జాతర సాంగ్‌ వినిపించారు. మొదట ఒక బిట్‌ సాంగ్‌లా చేద్దామని అనుకున్నారు. నేను ఫుల్‌సాంగ్‌ కొరియోగ్రఫి చేసిన తర్వాత ‘అదిరిపోయింది మాస్టర్‌ ఇలానే వెళ్దాం’ అన్నారు. ఆ సాంగ్‌ నచ్చిన తర్వాత ‘పుష్ప పుష్ప..’ టైటిల్‌ సాంగ్‌కి కూడా అవకాశం ఇచ్చారు. ఏం చేసిన పుష్ప క్యారెక్టర్‌ నుంచే రావాలని సుకుమార్‌ చెప్పారు. ఆయన విజన్‌కి తగ్గట్టుగానే చారు గ్లాస్‌ స్టెప్‌, ఫోన్‌ స్టెప్‌, ఫైర్‌ సిగరెట్‌ స్టెప్‌.. ఇవన్నీ కంపోజ్‌ చేశాను. గంగమ్మ తల్లి జాతర సాంగ్‌ నుంచి ట్రావెల్‌ అవుతున్నాను కాబట్టి ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయాను. టీ మూమెంట్‌ చూసిన తర్వాత బన్నీ అదిరిపోయింది మాస్టర్‌ అని చెప్పారు.
– ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’, రామ్‌ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘భైరవం’, ‘మ్యాడ్‌2’కి సింగిల్‌ కార్డ్‌ చేస్తున్నాను. హిందీలో ‘బేబీ’ చేస్తున్నాను.