పత్తాలేని ఈ పాలన!

– గ్రామపంచాయితిల్లో కనిపించని కంప్యూటరికరణ
– ఇంటర్నెట్ సౌకర్యం ఆపరేటర్లు లేక ఇబ్బందులు
– మూలన పడ్డ కప్యూటర్లు, సామాగ్రి
నవతెలంగాణ మల్హర్ రావు.
గ్రామాల్లో సాంకేతిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఆశించిన మేర విజయం సాధించడం లేవు. అవినీతి నిర్మూలన, పాలనలో పారదర్శకత, వేగానికి కంప్యూటరీకరణ ఎంతో అవసరం. కానీ చాలా గ్రామాల్లో సాంకేతిక పరికరాలు, సరైన సిబ్బంది లేక లక్ష్యం నీరుగారుతోంది.
 గ్రామ పంచాయతీలు అందించే సేవల్లో పారదర్శకత కోసమని 2015లో అప్పటి ప్రభుత్వం ఈ- పంచాయతీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకవచ్చింది. మండలంలో 15 జీపీలు ఉండగా వాటిలో పదింటికి కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్ లు అందజేశారు. కానీ ఆపరేటర్లను ఇవ్వకపోవడంతో ఈ- పాలన ప్రారంభమై తొమ్మిదేళ్లు దాటినా కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం మండలంలో ఐదు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది.కొయ్యుర్, ఇప్పలపల్లి,మల్లంపల్లి గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు లేవు.ఈ దశలో కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది.
ఇంటర్నెట్ లేక మూలకు..
మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్లను మూలన పడేశారు. ఆపరేటర్లు సైతం లేకపోవడంతో ప్రజలు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న సిబ్బందితోనే సేవలు పొందుతున్నారు. ఈ- పాలన ద్వారా జనన, మరణ నమోదు ధ్రువీకరణ పత్రాలు, హరితహారం వివరాలు, గ్రామ పం చాయతీ డిమాండ్ కలెక్షన్ల నివేదికను ఎప్పటిక ప్పుడు నమోదు చేయడం, ఇంటి పన్నుల వసూళ్లు, ఆసరా పింఛన్ దరఖాస్తుదారుల వివరాలు, వ్యక్తి గత మరుగుదొడ్ల వివరాలు, అభివృద్ధి నిర్మాణ మండల పరిషత్ కార్యాలయంలో దశల నమోదు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గృహాలు, గ్రామ కంఠం భూమి తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
10 పంచాయతీలకు అందజేత..
మండలం పరిధిలో 10 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కంప్యూటర్, యూపీఎస్, ప్రింటర్లు అందించింది. మండల పరిధిలోని తాడిచెర్ల,మల్లారం, పెద్దతూoడ్ల,రుద్రారం, కొండంపేట,ఎడ్లపల్లి, ఆన్ సాన్ పల్లి,నాచారం,చిన్నతూoడ్ల,వళ్లెంకుంట గ్రామాలకు ఇచ్చారు. వీటిలో చాలా గ్రామాల్లో కంప్యూర్లు వినియోగం లేకపోవడంతో వాటిని మూలన పడేశారు.

ఈ సేవలు అందించాలి….అక్కల బాపు యాదవ్…యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు.
గ్రామాల్లోనే ప్రజలకు ఈ సేవలను అందించాలి. అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేటర్ను ప్రభుత్వం నియమించాలి. ప్రజలకు అందుబాటులో ఈ సేవలు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నేరవేరుతుంది..