ఈ పాపం ఎవ్వరిది?

Whose sin is this?అప్రకటితంగా విరుచుకుపడే
ప్రకృతి ఆగ్రహ యుద్ధాన్ని
ఆపగలిగే విరుగుడు ఆయుధాలను
మనిషెన్నడూ కనుగొనజాలడనేది నిజం!

మూడొంతుల భూగోళమై
కో్లాది జీవరాశులను
కడుపులో దాచుకున్న
అందమైన మరోలోకం సముద్రం
నేడు మానవస్వార్థంతో
బలిసిన దేశాలు కావాలని
వదిలే మలినాలతో కలుషితమై
జలచరాలు జీవజాలం
కనుమరుగవుతున్నందుకు
మౌనంగా తనలో తానే
రోధించే ప్రశాంత సాగరం
రౌద్రరూపం దాల్చి ఉప్పెనలై తీరాలను
తీర ప్రాంత జనాలను
గ్రామాలను కబళిస్తుంటే…

మనిషి బతికేందుకు
నీడని వర్షాన్ని ఊపిరినిచ్చే
పచ్చటి జీవదాతలైన అడవుల్ని
స్వార్థపరులు దిగమింగేస్తుంటే…
అడవి కడుపున దాగి బతికే
అమాయక గిరిజనులను
నిటారు కొండల్ని నిలువున
స్వార్థం తొలిచేస్తూ పర్యావరణానికి
తూట్లు పొడుస్తూ వచ్చే వానకు కదిలే
రుతుపవనాలకు అడ్డునిలిచి
వాతావరణాన్ని తలకిందులు చేస్తున్నందుకు
మనం బతికే నేలదేహాన్ని
బోరుబావులంటూ ఛిద్రం చేస్తుంటే….

నేలారాలిన చినుకు
మట్టిని తడిపి భూగర్భ జలంగా
నిలవనీయని కాంక్రీట్‌ జనారణ్యంలో
వర్షపు నీరు మురికి కాలువలై వరదలై
రోడ్లను ఇళ్లను ముంచేస్తుంటే…

కనిపించిన చెరువులను
నాలాలను ఆక్టోపస్‌లా ఆక్రమిస్తూ
కబ్జాలు చేసి అనధికార అనుమతులతో
ఆకాశహర్మ్యాలు నిర్మిస్తుంటే
అతివృష్టికి అకాల వర్షాలకు కురిసిన
కుండపోత ధారలకు దారిలేక
వరదలై చెలరేగి ఆనకట్టల్ని తెంచుకొని
ఊర్లను నగరాలను ముంచేస్తుంటే…

చేతికందే పంట వరదపాలై
రైతు కంట కన్నీరై కారుతుంటే
జలప్రళయానికి నివాసాలు కూలి
నిలువ నీడలేక దిక్కుతోచని
అభాగ్యులు హాహాకారాలు చేస్తుంటే..

కక్కుర్తితో అన్నీ తామై అనుమతించి
మేల్కొన్న వ్యవస్థ ఆలస్యంగా
హైడ్రా రూపంలో టెంటకిల్స్‌
లాంటి బుల్డోజర్లతో
అక్రమ కట్టడాలను కూల్చేస్తుంటే
తెలియక కొనిమోసపోయిన
అమాయక సగటుజీవులు
గొల్లుమంటున్న దీనదృశ్యాలను
చూసి జాలి వేస్తుంటే
ఈ పాపం ఎవ్వరిదంటూ
నిగ్గదీసి అడగాలనుంది!

అధికారం రంగులు మారినా
మారని ప్రజా చైతన్యం
మనిషి ఉనికికి జీవం పోసే
నీరు నేల ఆకాశం అందరిదని
కడుపులో దాచుకుని కాపాడే
ప్రకృతికి కడుపుకోత రాకుండా
ఇహనైనా హద్దుగోడలై అడ్డుకుందాం!

– డా.కె.దివాకరాచారి
9391018972