ఈ విజయం ప్రేక్షకులదే..

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన మిస్టికల్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అందించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదలై, ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ,’ ‘ఈ సినిమా సక్సెస్‌ నాదో, మా టీమ్‌దో కాదు. మన ఆడియెన్స్‌ది. గత ఏడాది కొన్ని సినిమాలకు జనాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు ఛాలెంజ్‌ విసిరారు. మేం థియేటర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండని చెప్పారు. ఆ ఛాలెంజ్‌కి ఆన్సరే విరూపాక్ష. ఈ సినిమా మన ఫిల్మ్‌ ఇండిస్టీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌. పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాను సక్సెస్‌ చేసిన ఆడియెన్స్‌కి థ్యాంక్స్‌. మా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ రజినీ. అలాగే మా ఎడిటర్‌ నవీన్‌. ఆయనకు నేను మూడు గంటల సినిమా ఇస్తే ఆయన ఎక్కడా ఎలాంటి ఎమోషన్‌ మిస్‌ కాకుండా దాన్ని రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఎడిట్‌ చేసి ఇచ్చారు. అజనీష్‌ గ్రేట్‌ వర్క్‌ ఇచ్చారు. సౌండ్‌ డిజైన్‌ చేసిన రాజా కృష్ణ, సచిన్‌కు థ్యాంక్స్‌. ఎక్స్‌ట్రార్డినరీ అవుట్‌ఫుట్‌ ఇచ్చారు. మా డైరెక్షన్‌ టీమ్‌ నా బలం. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా హిట్‌ ఇస్తారని ఈ సినిమా మళ్ళీ నిరూపించింది’ అని డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తెలిపారు. హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ, ‘ఈ సక్సెస్‌లో నాకు వస్తున్న స్పందనకు కారణం మా డైరెక్టర్‌ కార్తీక్‌. నా పర్సనల్‌ టీమ్‌ కూడా అండగా నిలబడటంతో నేను నా వర్క్‌పై పోకస్‌ పెట్టగలిగాను’ అని చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ మాట్లాడుతూ, ”విరూపాక్ష సినిమా సక్సెస్‌ కావటం చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్‌ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్‌ కార్తీక్‌ విజువలైజ్‌ చేసిన దానికి మ్యూజిక్‌ తోడైంది. హారర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో నేను ఫస్ట్‌ చేసిన మూవీ ఇది. కొత్త స్టైల్‌లో చేశాను. ఆ ఐడియా వర్కవుట్‌ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సక్సెస్‌లో నన్ను భాగం చేసిన నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని అన్నారు. ఈ వేడుకలో సినిమాటో గ్రాఫర్‌ శ్యామ్‌ దత్‌, అజయ్‌, బ్రహ్మాజీ, సాయిచంద్‌ పాల్గొని సినిమా సక్సెస్‌ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.