– అల్లు అర్జున్
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. దీనికి నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలు. గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డులు సష్టించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘పుష్ప’ అనేది ఓ ఎమోషన్. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్‌దే. ఈ సినిమా కోసం మేం చేసిన 5 ఏళ్ళ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సినిమా విజయాన్ని నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. ‘పుష్ప-3′ ఏంటో తెలియదు. కానీ ఓ అద్బుతంలా కనిపిస్తుంది. నిర్మాతలు రవి, నవీన్ లేకుంటే పుష్ప సాధ్యమయ్యేది కాదు. దేవిశ్రీ ప్రసాద్ తన అద్భుతమైన సంగీతంతో సినిమాకు ఎనర్జీ ఇచ్చాడు’ అని తెలిపారు.
‘మైత్రీ మూవీస్ చెర్రీ సలహాతోనే ‘పుష్ప’ను రెండు భాగాలుగా చేశాను. ఆయన సలహా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాకు ‘రంగస్థలం’ నుంచి ఇప్పటి వరకు వరుస హిట్స్ రావడానికి మైత్రీ మూవీస్ కారణం. ఈ విజయం వాళ్లదే. నాపేరు సుకుమార్ కాదు.. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి లేకుండా నేను సినిమా చేయలేను. ఈ ప్రపంచంలో నన్ను ఓ అద్బుతంలా భావించే వ్యక్తి అల్లు అర్జున్. నన్ను నమ్మే వ్యక్తి. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్‌దే’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.