– ఎంపికపై పార్టీలో ఆధిపత్యపోరు
– జాతీయ నాయకత్వం కోర్టులో బంతి
– సమావేశాలపై దిశానిర్దేశం చేయని వైనం
– ఏం మాట్లాడాలనే దానిపై స్పష్టత కరువు
ఈ’సారీ’..అసెంబ్లీ సమావేశాలకూ ఎల్పీనేత ఎవరనేది బీజేపీ తేల్చలేదు. ఎంపిక విషయంలో నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉన్నది. ఎల్పీనేత ఎంపిక వాయిదా పడుతూనే పోతున్నది. రాజాసింగ్‌నా? మహేశ్వర్‌రెడ్డినా? వెంకటరమణారెడ్డినా? అనేది ఎటూ తేల్చుకోలేక అధిష్టానం సతమతమవుతున్నది. రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసి బంతిని జాతీయ నాయకత్వం కోర్టులోకి నెడితే అక్కడా పెండింగ్‌లోనే ఉంది. అంతిమంగా ఎల్పీనేత ఎంపిక కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల్లో కమలం పార్టీ తరుపున ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై స్పష్టత లేదు. వాస్తవానికి 2022 ఆగస్టులో రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీకి అసెంబ్లీలో ఎల్పీ నేత లేకుండా పోయారు. ఆ సమయంలో అన్ని అంశాలపైన పట్టున్న రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ దాటవేత ధోరణిని అవలంబించింది. గత అసెంబ్లీలో ఏడాదిన్నర పాటు ఆ పార్టీకి శాసనసభా పక్ష నేత లేని విషయం విదితమే. ప్రస్తుతం కూడా అదే వైఖరితో ముందుకెళ్తున్నది.
అసెంబ్లీ సమావేశాల ముందు ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తుంది. అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తాల్సిన అంశాలపై ఫోకస్‌పెట్టి దానిపై గైడ్‌లైన్స్ ఇస్తుంది. కానీ, బీజేపీలో అదేమీ కనిపించడం లేదు. ఏ పార్టీకైనా తొలి సమావేశాల్లోనే ఎల్పీనేతను ప్రకటించడం ఆనవాయితీ. కానీ, తొలి సమావేశాల్లో ఎల్పీ నేత ఎంపికపై హడావిడి చేసి దాటవేసింది. ఆ తర్వాత తరుణ్‌చుగ్, కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయినప్పటికీ ఎటూ తేల్చలేకపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా బీజేపీఎల్పీ నేతను తేల్చుతారని రాష్ట్ర నాయకులు తెగ ప్రచారం చేశారు. కానీ, అక్కడ అమిత్‌షా తాను వెళ్లే ముందు ఎమ్మెల్యేలను చుట్టపుచూపులా పరిచయం చేసుకుని వెళ్లారే తప్ప ఎల్పీ నేత ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. సమస్యను తెగేదాకా లాగితే అది మరింత జఠిలం అవుతుందన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి తయారైంది. ఎల్పీనేత ఎంపిక ఆ పార్టీలో చిచ్చుపెట్టి కూర్చున్నది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా ఓ గ్రూపు ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీబాట పట్టినట్టు తెలిసింది. వారు అక్కడకు ఎందుకెళ్లారు? ఎల్పీనేత ఎంపిక గురించి తేల్చాలనే డిమాండ్‌తోనా? రాష్ట్ర నాయకత్వం తీరుపై ఫిర్యాదు చేయడానికా? అనేదానిపైనే ప్రధానంగా చర్చ నడుస్తున్నది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఏయే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానిపై రాష్ట్ర నాయకత్వం సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయకపోవడంపైనా ఎమ్మెల్యేలు ఆగ్రహంతోనూ ఉన్నారు.
బీజేపీలో ఫ్లోర్ లీడర్ నియామకం కోసం నేతలు పోటీ పడుతున్నారు. సీనియారిటీ ప్రకారం తనకే వస్తుందని రాజాసింగ్ లెక్కలు వేసుకుంటున్నారు. అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డి తనకు వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే రేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండగా పైడి రాకేశ్ రెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే పార్టీ మాత్రం దీనిపై ఎంతమాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఫ్లోర్ లీడర్ పదవి కోసం పోటీపడే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయ లోపం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉందనే విమర్శలు వస్తున్నాయి.
అందరూ పోటీదారులే..
ఎమ్మెల్యేలందరూ తమకంటే తమకే ఆ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. సీనియర్, పార్టీ ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని మొదట రాజాసింగ్‌కు ఆ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయన దూకుడుతనం, తెలుగు భాషపై పట్టులేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అక్కడ మొదలైన పంచాయతీ నాకంటే నాకు అనే దాకా వెళ్లింది. సామాజిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకే ఆ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎవ్వరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో ఎల్పీ పదవిని బీసీనైన తనకే ఇవ్వాలని పాయల్ శంకర్ కోరుతున్నట్టు తెలిసింది. కొందరు మహేశ్వర్‌రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై పోటీచేసి గెలిచిన తనకే ఎల్పీ పదవి కటబెట్టాలని వెంకటరమణారెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తానూ తక్కువేంకాదన్నట్టు పైడి రాకేశ్‌రెడ్డి కూడా పైస్థాయిలో ఫైరవీ చేసుకుంటున్నాడు.