నెల్లూరు నరసింహారావు
అక్టోబర్7వ తేదీనాడు మొదలైన పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఇజ్రాయిల్ పైన హమస్ రాకెట్లను ప్రయోగించటమే కాదు, అది ఇజ్రాయిల్ భూభాగంలో కూడా చొరబడ గలిగింది. ఆపరేషన్ ”అల్- అక్సా ఫ్లడ్” పేరు తో జరిగిన ఈ దాడి వెనుక పక్కా ప్రణాళిక, ఊహాతీత సాహసం ఉన్నాయి. 1000మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. 3500 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని ప్రాంతాలు ఆక్రమణ లకు గురయ్యాయి. సైనిక సిబ్బంది, పౌరులు బంధీలయ్యారు. ఇజ్రాయిలీ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించి గాజా ప్రాంతాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిన పూనాడు. ఈ సంఘటన ఇజ్రాయిలీ భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొస్సాద్ సర్వవ్యాప్తమని, ఇజ్రాయిలీ సైన్యం అజేయమని భావించే వారివి భ్రమలని హమస్ ఆకస్మిక దాడి నిరూపించింది. పాలస్తీనా సాయుధ గ్రూపులు దేశంపైన దాడి చేస్తుండగా అనేక గంటలపాటు ఇజ్రాయిలీ సైన్యం షాక్ లో ఉంది. గూఢచార వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. హమస్ ఇజ్రాయిల్ పైన దాడి చేయటా నికి 1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధ 50వ వార్షిక దినాన్ని ఎంచుకుంది. ఈ అవమానం నుంచి ఇజ్రాయిల్ బయటపడాలంటే శత్రువును ఊచకోత కోయాలి. అందుకోసం గాజాలో తన సైన్యాన్ని దించాలి. అయితే ఈ పోరులో హమస్ ఒక్కటే లేదు. దానికి ఇరాన్, లెబనీస్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాల మద్దతు ఉంది. అంతకుముందు హెజ్బొల్లా రెండవ ఫ్రంట్ ను ఓపెన్ చేస్తానని మాట ఇచ్చింది. నేడు అది బాహాటంగా పాలస్తీనా వైపు సాయుధంగా పాల్గొంటోంది. హెజ్బొల్లా దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి. దానికి ఇరాన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది. 1985లో మొదలైన హెజ్బొల్లా గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతమైవుంది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అనేక విజయా లను సాధించింది. లెబనాన్ లో దానికి పెద్ద ఆయుధాగారం ఉంది. ఆ ప్రాంతంలో బల మైన మిత్రులున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు అది లెబనాన్ లో ఒక రాజకీయ పార్టీగా కూడా వుంది. దాని సైనిక బలం గురించి, ఆయుధ బలం గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఇరాన్ కున్న ఆయుధాలు హెజ్బొల్లాకు కూడా ఉన్నట్టే. వీటిలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం హెజ్బొల్లా ఇరాన్ నుంచి వేల కోట్ల డాలర్ల సహాయాన్ని పొందుతోంది. అంటే హెజ్బొల్లా ఇజ్రాయిల్‌ను భూమి, ఆకాశం, సముద్ర జలాలలో ప్రతిఘటించగలదు. దాని దగ్గర నౌకలను ముంచగలిగిన మిస్సైల్స్, డ్రోన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా హెజ్బొల్లా దగ్గర 500 నుంచి 700కిలోమీటర్ల దూరంలోవున్న లక్ష్యాలను ఛేదించగలిగిన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అంటే ఇజ్రాయిల్ లో ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యం హెజ్బొల్లాకు ఉంది. అంతేకాకుండా హెజ్బొల్లాకు సుశిక్షితులైన ఒక లక్షమంది సైన్యం ఉందని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ హస్సన్ నస్రల్లా చెప్పాడు. వీరుకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి అనేక సేవల కోసం మద్దతుదారులను కూడగట్టగలిగే శక్తి ఈ సంస్థకు ఉంది. 2006లో జరిగిన రెండవ లెబనాన్ యుద్ధం తరువాత హెజ్బొల్లా దగ్గరవున్న క్షిపణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం హెజ్బొల్లా దగ్గర దాదాపు 2లక్షల క్షిపణులు ఉన్నాయి. వీటిలో సూటిగా లక్ష్యాలను ఛేదించ గలిగేవి, డ్రోన్లు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇవేకాకుండా ఇరాన్ హెజ్బొల్లాకు లెక్కలేనన్ని ఫిరంగులు, వాటిలో ఉపయోగించే షెల్స్‌ను సరఫరా చేసింది. ఈ సంస్థ దగ్గర అనేక వేల సాయుధ శకటాలు ఉన్నాయి. వీటిలో టి-55, టి-72, టి-80 ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్ పై రోజుకు 3000క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం హెజ్బొల్లాకు ఉంది. హెజ్బల్లా దగ్గర 2000డ్రోన్లు కూడా ఉన్నాయి.
ఇవే కాకుండా ఇజ్రాయిలను మరో సమస్య వేధిస్తోంది. హెజ్బొల్లాకు విస్త్రుతమైన సొరంగ మార్గాలున్నాయి. వీటివల్ల భూగర్భంలో హెజ్బొల్లా యోధులు ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా పయనించగలరు. తమ సైనిక సామాగ్రిని, ఆయుధాలను దాచుకో గలరు. ఇజ్రాయిలీ సైన్యం వీటిని నిరంతరం ధ్వంసం చేస్తూ వుంటుంది. అయితే వీటి సంఖ్య గణనీయంగా ఉండటంవల్ల వీటిని నాశనం చేయటం ఇజ్రాయిల్ కు సాధ్యపడటం లేదు. వీటివల్లనే హెజ్బొల్లా ఆకస్మిక దాడులను చేయగలుగుతుంది. అంతేకాక హెజ్బొ ల్లాకు ఐటి వంటి సమాచార సాంకేతికతల పైన కూడా పట్టువుంది. ఎలెక్ట్రానిక్ యుద్ధ పరి జ్ఞానం, హ్యాకింగ్ వంటి సాంకేతికలపైన హెజ్బొల్లాకు మంచి అవగాహన వుంది. పైన వివరించిన పరిస్థితిని బట్టి మనం కొన్ని ముఖ్యమైన నిర్దారణలకు రావచ్చు. ఒకవేళ హెజ్బొల్లాపైన ఇజ్రాయిల్ గెలవటం జరిగితే అది కష్టనష్టాలతో వచ్చే విజయమే అవుతుందితప్ప సునాయాసంగా గెలిచేది కాజాలదు. ఇజ్రాయిల్‌తో ప్రత్యక్షంగా తలపడితే హెజ్బొల్లా కూడా తీవ్రంగా నష్టపోతుంది. అయితే ఇరుపక్షాల అస్తిత్వ నియమాల మధ్య ఒక మౌలికమైన తేడావుంది. హెజ్బొల్లా స్రుష్టించ బడిందే చావోరేవో తేల్చుకోవటానికి. తాను ఎంతగా నాశనమైపోయినా దాని లక్ష్యం శత్రువును చావు దెబ్బ కొట్టటమే. అయితే ఇజ్రాయిల్ అందుకు సిద్దంగా ఉందా? అనేదే తేలవలసిన ప్రశ్న.