ఆ ఆరోపణలు అవాస్తవం

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.నవీన్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమనీ, నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.నవీన్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో తనపై ఒక దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన ఖండించారు. ఆ వార్తలో పేర్కొన్నట్టు ప్రణీత్‌ రావు, శ్రవణ్‌ రావులతో తనకు కనీస పరిచయాలు కూడా లేవని స్పష్టం చేశారు. కనీసం ఫోన్లో కూడా వారితో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా కొంత మంది తన పేరును ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అధికారులు ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు.