ఆ గ్యారంటీల అమలు సాధ్యమే

Those guarantees are enforceable– ప్రతి పేదవానికి బడ్జెట్‌ ఫలితాలు అందాలి
– సంపదపై పన్ను విధించాలి
– అసెంబ్లీలో సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మనసుంటే మార్గముంటుందనీ, కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలు సాధ్యమేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. బుధవారం శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రగతి సాధించిందంటూ ఆ పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఇందు కోసం కడియం కొన్నికొలమానాలను ప్రస్తావించారనీ, అయితే నీటిఅయోగ్‌ ఇచ్చిన పలు అంశాల్లో రాష్ట్రం వెనుకబడి ఉందన్న విషయాన్ని కూనంనేని గుర్తుచేశారు. అది ధనిక రాష్ట్రమంటే తలసరి ఆదాయం సగటు గణింపు, మిగులు ఆదాయం కాదనీ, బడ్జెట్‌ ఫలితాలు అందరికి అందితేనే ధనిక రాష్ట్రమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లు అప్పు చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో మెరుగైన ఆర్థిక నిర్వహణ చేయగలిగితే హామీలన్నింటినీ అమలు చేయవచ్చని సూచించారు. హైదరాబాద్‌ లో వేలాది ఎకరాల దేవాదాయ, భూదాన, వక్ఫ్‌ భూములతో పాటు చెరువుల కింద భూములు కూడా ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రైతుబంధు సాయాన్ని 10 ఎకరాలకు అటు, ఇటుగా పరిమితం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని కూనంనేని సూచించారు.
వారికి నేరుగా జీతాలివ్వండి
ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లిస్తున్నట్టుగానే రాష్ట్రంలోనూ చెల్లించాలని కూనంనేని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.ఆయా క్యాడర్ల వారీగా ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో ఏజెన్సీలు కోత విధించి ఉద్యోగులకు తక్కువగా ఇచ్చి దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత బెనిఫిట్స్‌ అందుతున్నట్టుగా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, అసంఘటిత కార్మికులకు వర్తించేలా బీమా కంపెనీల సాయంతో చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని దేశాల్లో విధిస్తున్నట్టుగా మన రాష్ట్రంలో సంపన్నులకు పన్ను విధించాలని కోరారు.తెలంగాణ ఉద్యమం, బీఆర్‌ఎస్‌ పాలనలో బనాయించిన కేసులను ఎత్తివేయాలన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శెట్టిబలిజ తదితర 26 కులాలను బీసీల్లో చేరుస్తామన్న హామీని నిలెబట్టుకోవాలని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించకుండా చూడాలనీ, ధరణి బందాల నుంచి తొందరగా బాధితులను విముక్తులను చేయాలన్నారు. కాళేశ్వరం సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
వరంగల్‌ను దత్తత తీసుకోవాలి: నాయిని రాజేందర్‌ రెడ్డి
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ వరంగల్‌ జిల్లాను బీఆర్‌ఎస్‌ చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. దాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో కేజీబీవీలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం హామీల్లో భాగంగా కేంద్రం ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ మక్తల్‌ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు.
కునారిల్లిన వైద్యారోగ్య వ్యవస్థ : డాక్టర్‌ వంశీకృష్ణ
బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థ కునారిల్లిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ వైద్యమంటూ కనీస వైద్యాన్ని కూడా అందివ్వలేదని విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు మెడికల్‌ కాలేజీల వరకు అన్నింటిని పూర్తి స్థాయి సిబ్బంది లేకుండానే కొనసాగించారని తెలిపారు. ఆస్పత్రుల్లో స్టాఫ్‌ నర్సులు, అదే విధంగా డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కోరారు. శాసనసభలో ఆయన పార్టీల నుంచి 15 మంది సభ్యులు డాక్టర్లే ఉన్నారనీ, వీరిలో ఏడుగురు ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థులని తెలిపారు. వైద్యారోగ్య రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో వారి సూచనలు, సలహాలను స్వీకరించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.హరీశ్‌ బాబు మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంలో హెరిటేజ్‌ సమస్య,కోర్టు సమస్యలుంటే మిగిలిన ఖాళీ స్థలాన్ని పరిశీలించాలని సూచించారు.