– ఫిరాయింపులపై కేఏ పాల్ పిల్
– మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరిగే కార్యకలాపాల్లో జోక్యం పాల్గొనకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తగిన సమయంలోగా విచారణ పూర్తి చేయాలన్న తమ ఉత్తర్వులను స్పీకర్ అమలు చేయాల్సివుందని చెప్పింది. కాబట్టి వారు అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే మధ్యంతర ఆదేశాల జారీ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్టి జె.శ్రీనివాస్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం జడ్జిమెంట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై పాల్ వేసిన పిల్లో మ్యద్యంతర పిటిషన్‌ను కొట్టేసింది.
శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్‌పై తీర్పు వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఓ తెలుగు టీవీ చానల్ ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు గురువారం పూర్తి కావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. ఎస్ఐబీ అధికారులతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించారనీ, తన కార్యాలయంలోనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఉంచుకున్నారంటూ శ్రవణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆయనకు నాంపల్లి కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఈనేపధ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి గురువారం విచారణను పూర్తి చేశారు. విచారణకు సహకరిస్తామనీ, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అది ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతివాదన చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో మరో నిందతుడైన అడిషనల్ మాజీ ఎస్పీ భుజంగరావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను డిసెంబర్ నాలుగు వరకు హైకోర్టు పొడిగించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం ఆగస్టులో నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 14 తర్వాత ఆ బెయిల్ పొడిగింపునకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టుకు వచ్చారు.
లా అడ్మిషన్లపై హైకోర్టు ఆదేశాలు
న్యాయ విద్య కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఇచ్చిన గైడ్‌లైన్స్ మేరకు సీట్ల భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను జూలైలోపు పూర్తి కాకపోవడంపై లాయర్ భాస్కర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే ఆధ్వర్యంలోని బెంచ్ విచారిచింది. ఈ ఏడాదికి న్యాయ విద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో వచ్చే ఏడాది నుంచి యూజీసీ, బీసీఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం లా అడ్మిషన్లు ఉండాలని సూచించింది. పిటిషన్‌ను క్లోజ్ చేసింది.