ఆ వార్తలు పుకార్లు

– అవి అత్యంత అర్థంలేనివి
– ‘ఇండియా’ సమావేశానికి తన గైర్హాజరిపై కథనాలను కొట్టిపారేసిన బీహార్‌ సీఎం
న్యూఢిల్లీ : ఢిల్లీలో జరిగే ప్రతిపక్ష భారత కూటమి సమావేశానికి తాను హాజరు కావటం లేదన్న వార్తలను బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కొట్టిపారేశారు. ఆ వార్తలను ”అత్యంత అర్ధంలేనిది”గా అభివర్ణించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున్‌ ఖర్గే తలపెట్టిన సమావేశం డిసెంబర్‌ 17కు వాయిదా పడింది. తనకు జ్వరం ఉన్నందున సమావే శానికి హాజరు కాలేకపోయానని నితీశ్‌ అన్నారు. ”నేను ఇండియా బ్లాక్‌ మీటింగ్‌కి హాజరు కాలేదని పుకార్లు వచ్చాయి. ఇది నాన్సెన్స్‌. ఆ సమయంలో నాకు జ్వరం వచ్చింది. తదుపరి మీటింగ్‌ ఎప్పుడు జరిగినా నేను ఖచ్చితంగా వెళ్తాను” అని నితీష్‌ అన్నారు. నితీష్‌ కుమార్‌కు బదులుగా సీనియర్‌ నేతలు జేడీ(యూ) చీఫ్‌ లాలన్‌ సింగ్‌, బీహార్‌ జలవనరుల శాఖ మంత్రి సంజరు కుమార్‌ ఝా సమావేశానికి హాజరవుతారని గతం లో వార్తలు వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యూహాన్ని రచించేందుకు ప్రతిపక్ష భారత కూటమి నేతల సమావేశానికి మల్లికార్జున్‌ ఖర్గే పిలుపునిచ్చారు. అయితే, కొన్ని కారణాలతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరుకాకపోవడంతో అది వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ సమావేశానికి పిలుపు నివ్వటం ప్రాధాన్యతను సంతరించు కున్నది. ‘ఇండియా’ కూటమి కాంగ్రెస్‌ నేతృత్వంలోని పలు రాజకీయ పార్టీల కూటమి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ను ఎదుర్కోవడానికి ఈ ఏడాది జూలైలో బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీ సమావేశంలో ఈ కూటమి ఏర్పడింది.