– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
– ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించిన జిల్లా కమిటీ
నవతెలంగాణ-కొత్తగూడెం
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన పోలీసు అధికారులపై న్యాయ విచారణ జరిపించి, ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత కుటుంబానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ చిన్ననాటి నుండే కష్టపడే మనస్తత్వం, అందరితో స్నేహభావంగా మెలుగుతూ, ప్రజలకి, పార్టీల నాయకత్వానికి స్నేహభావంతో మెలిగే శ్రీనివాస్ మరణం పట్ల పార్టీ జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించిందన్నారు. ఇటువంటి సంఘటన జరగడం దారుణమని ఈ సంఘటనలకు కారణాలను క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి, ప్రేరేపించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అతని భార్యకు ప్రభుత్వం ఉన్నతమైన ఉద్యోగాన్ని కల్పించి వారి పిల్లలకు అండగా ఉండాలన్నారు. ఇటువంటి సంఘటనలు పున్నారావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టపరిచి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ పై అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి కారకులను విచారణ జరిపించి తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో స్పందించకపోవడం వలన ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నాయని ఎస్సై శ్రీనివాస్ మరణ వాంగ్మూలమే ఆధారంగా కనిపిస్తుందని కనకయ్య అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించే పోలీసు వ్యవస్థలోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే జవాబుదారీతనం ఎలా నిరూపించుకుంటారో అర్థం కాని స్థితిలో పాలకవర్గాలు, పోలీసులు ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని పరిష్కారం చేయాలని అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే చర్యలు తీసుకునేలా అన్యాయానికి గురైన వారిని న్యాయం కల్పించేలా ఒక కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు.