ఆ ముగ్గురే హాట్‌టాపిక్‌

Those three are the hot topic– రెండేసి చోట్ల పోటీ ఎందుకో..!?
– ఏదీ ఉంచుకుంటారు ? ఏదీ వదిలేస్తారు ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో ముగ్గురు కీలకనేతలు రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు. వారెవరో అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిట్టింగ్‌ సీటు గజ్వేల్‌తోపాటు కొత్తగా కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అలాగే టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన పాత సీటు హుజురాబాద్‌తోపాటు గజ్వేల్‌ నుంచి ఎన్నికల గోదాలోకి దూకారు. ముగ్గురు నేతలు తమ తమ సిట్టింగ్‌ సీట్ల నుంచి పోటీపడుతూనే అదనంగా మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఇటు రేవంత్‌, అటు ఈటల పోటీపడుతున్నారు. కాకపోతే రేవంత్‌ కామారెడ్డి నుంచి, ఈటల గజ్వేల్‌ సీటులో కేసీఆర్‌కు ప్రత్యర్థులుగా ముందుకొస్తున్నారు. వీరు ముగ్గురు రెండేసి చోట్లా పోటీచేయడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నది. ఎందుకనేది సుస్పష్టం. రాజకీయ వైరం. పార్టీల విధానాలు. వ్యక్తిగత అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈటల రాజేందర్‌ మాత్రం ‘నన్ను హేళన చేసినందుకే’ గజ్వేల్‌ బరిలోకి వచ్చానని స్పష్టం చేశారు. బతికుండగానే నాకు నరకం చూపించారంటూ వ్యక్తిగత కక్ష సాధింపు తరహాలో మాట్లాడుతున్నారు. అలాగే రేవంత్‌ విషయంలోనూ అనేక కారణాలు ఉన్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తా అని మాట ఇచ్చి మోసం చేశారనే కోపం ఇంకా ఉంది. అంతేగాక కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబం సోనియా, రాహుల్‌పై తరచుగా రాజకీయ విమర్శలకు పూనుకుంటున్నారు. ఇది ఏమాత్రం కాంగ్రెస్‌కు నచ్చడం లేదు. అంతేగాక రేవంత్‌కు వ్యక్తిగత వైరం అందరికి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో పక్కా ప్లాన్‌ ప్రకారం ఇరికించి జైలుకు పంపారనే విమర్శ ఉండనే ఉంది. గురువారం పాలకుర్తి కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ మాట్లాడుతూ ‘నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావే కారణమనీ, ఆయనే కేసీఆర్‌కు సహకరించారని’ బాహాటంగానే చెప్పారు. వేర్వేరు సీట్లల్లో కేసీఆర్‌ను అడ్డుకోవడానికి, ఇబ్బంది పెట్టడానికే రేవంత్‌, ఈటల రాజకీయ వ్యూహాల ప్రకారం పోటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే పోటీ చేస్తున్న రెండేసీ సీట్లల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారనేది అందరికి స్పష్టత ఉంది. కేసీఆర్‌ రెండు చోట్లా విజయం సాధిస్తారనే వ్యాఖ్యానాలు ఉండనే ఉన్నాయి. ఆయన మళ్లీ గజ్వేల్‌ సీటు నుంచే ఎమ్మెల్యేగా కొనసాగుతారనీ, కామారెడ్డిని తన కూతురు కవితకు అప్పగిస్తారనే ప్రచారం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జరుగుతున్నది. విపక్షాలూ ఇదే మాట అంటున్నాయి. ఇక ఈటల, రేవంత్‌లు ఇద్దరూ కేసీఆర్‌పై పోటీచేసినా ఓడిపోక తప్పదనీ, కాకపోతే గట్టిపోటీ ఇస్తారనడంలో సందేహాం లేదనేది విశ్లేషకుల మాట. కామారెడ్డిలో పోరు రసవత్తరం కానుంది. ఇక్కడి ఎన్నిక దేశాన్ని ఆకర్షిస్తున్నది. అందరి నోళ్లల్లో నానుతున్నది. వీరిరువురూ తిరిగి కొడంగల్‌, హుజురాబాద్‌కే పరిమితమవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు సంగతి ఏంటంటే కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీచేయడం వెనుక మర్మమేంటి ? అనే చర్చ కూడా జోరుగానే సాగుతున్నది. అక్కడ వేలాది ఎకరాల విలువైన భూములను కొల్లగొట్టడానికే ఎన్నికల బరిలో ఉన్నారనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. వీటిని గులాబీ శ్రేణులు ఖండిస్తున్నాయి.