ఫోటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ఫోటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌
కింద కేసు నమోదు చేయాలి : తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విధినిర్వహణలో ఉన్న ఫోటో జర్నలిస్ట్‌ నగర గోపాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.హరి డిమాండ్‌ చేసారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫోటో జర్నలిస్ట్‌ నగర గోపాల్‌ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్‌ గౌడ్‌ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడం వల్ల తీవ్ర గాయాలై ప్రస్తుతం సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నగర గోపాల్‌ను సహచర ఫోటో జర్నలిస్టులతో కలసి పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే నగర గోపాల్‌పై దాడి చేసిన మహేష్‌ గౌడ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని డిమాండ్‌ చేసారు. రిపోర్టర్ల ముసుగులో రౌడీల్లా ప్రవర్తిస్తూ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ను కోరారు.