బాండు డబ్బులు ఇవ్వని వారికి వెంటనే చెల్లించాలి

బాండు డబ్బులు ఇవ్వని వారికి వెంటనే చెల్లించాలి– ఆర్టీసీకి సర్కారు తక్షణమే వెయ్యి కోట్ల గ్రాంట్స్‌ ఇవ్వాలి
– రెండేండ్లపాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించాలి
– ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ ఇన్‌చార్జి జనరల్‌ సెక్రటరీ సయ్యద్‌ మహమూద్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇంకా ఇవ్వని వారికి రెండు రోజుల్లో బాండు డబ్బులు చెల్లించాలని ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ ఇన్‌చార్జి జనరల్‌ సెక్రటరీ సయ్యద్‌ మహమూద్‌ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వం తక్షణమే వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్స్‌ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్థిక, రవాణా మంత్రులను కోరుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సంక్షోభంలో ఉందని.. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకాన్ని కార్మికులు చాలా జయపద్రంగా నిర్వహిస్తున్నారని, అందుకు సంబంధించి ఆర్టీసీకి నెలకు చెల్లించాల్సిన రూ.300 కోట్లు సకాలంలో విడుదల చేయడం లేదన్నారు. దాంతోపాటు కార్మికుల వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీకి రూ.6వేల కోట్ల నష్టం వాటిల్లిందని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి ఆర్టీసీ కార్మికులందరూ సంపూర్ణ మద్దతునిచ్చారని గుర్తుచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్టీసీకి ట్యాక్స్‌ హాలిడే ఇచ్చారని, ఇప్పుడు కూడా రెండేండ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించాలని కోరారు. తద్వారా ఆర్టీసీకి కొత్తగా 1500 బస్సులు కొని.. బలోపేతం చేద్దామని పేర్కొన్నారు. 30ఏండ్లపైగా సర్వీసు ఉన్నా కండక్టర్‌, డ్రైవర్లకు ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితుల్లో సంస్థ లేదని, ఇప్పటికైనా అన్ని క్యాటగిరిల్లో ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ వీలినంపై తక్షణ చర్యలు చేపట్టాలని, మహాలక్ష్మి పథకం అమల్లో పొరపాట్లకు కండక్టర్లను సస్పెండ్‌ చేయొద్దని పేర్కొన్నారు. ఓవర్‌లోడ్‌ బస్సుల వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయని.. ఈ మినహాయింపు ఇవ్వాలని కోరారు 2014 నుంచి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాలని, సీసీఎస్‌, పీఎఫ్‌ అమౌంట్‌ రిఫండ్‌ చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ ఎండీలను కలుస్తామన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీని రక్షించుకోవడం కోసం ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని పేర్కొన్నారు.