అగ్గి రాజేసిందెవరు? ఆజ్యం పోసిందెవరు?

మణిపూర్‌లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ. ఇది జరిగి 77రోజులు గడిచినా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలై బయటి ప్రపంచానికి తెలిసేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకో లేదు. సుప్రీంకోర్టు ”మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేము తీసుకోవాలా” అని కేంద్రాన్ని హెచ్చరిస్తే గానీ స్పందించడం లేదంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగా వ్యవహరిం చాయో అర్థం చేసుకోవచ్చు. అస్సలు అక్కడ అగ్గి రాజేసింది ఎవరు? ఆజ్యం పోసింది ఎవరు? చలి మంటలు కాచుకుంటున్నది ఎవరు? ఓట్ల కోసం ఏమైనా చేస్తారా?. లూటీలకు లూటీలు, హత్యలకు హత్యలు జరుగుతూ, మధ్యయుగ కాలంనాటి మత యుగాన్ని తలపిస్తున్నా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు? స్థానికంగా ఉన్న పోలీసులు చర్యలేమయినట్లు? ఆర్మీ కాళ్లకు సంకెళ్లు వేసింది ఎవరు? న్యాయం చేయాల్సిన న్యాయస్థానం అన్యాయంగా వ్యవహరిస్తే ఆదివాసి లను ఆదుకునేదెవరు? స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో పర్యటించినా ఫలితమేది? ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని చల్లబరిచినట్లా? లేదా అగ్నికీ మరింత ఆజ్యం పోసినట్లా? ఇదంతా దేశ ప్రజలు ఆలోచించాలి.
అక్కడ చెరబట్టింది ఆదివాసీ ఆడబిడ్డలను కాదు, యావత్‌ భారతదేశ మానప్రాణాలను. దేశాన్ని కాపాడిన సైనికుని భార్యకు దేశంలోనే రక్షణ లేదంటే దేశం ఏటుపోతునట్లు? ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు మారుతున్నాయని పదే పదే ప్రసంగించిన వారు దీనికి సమాధానం చెప్పాలి. రోమ్‌ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నట్టుగానే ఉన్నది ప్రధాని 78రోజుల మౌనం. న్యాయస్థానం(హైకోర్టు) అన్యాయానికి ఆజ్యం పోస్తే, రక్షించాల్సిన పోలీసులే రాక్షసులకు అప్పగిస్తే బాధితులకు రక్షణ కల్పించేదెవరు? విదేశాల్లో ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే మనం, మనం దేశ సంఘటన సోషల్‌ మీడియాలో వస్తేగాని స్పందించలేరంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత పరడవిల్లినట్లు? మతం మత్తుమందు లాంటిది అన్నాడు కారల్‌ మార్క్స్‌. మధ్యయుగ కాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మార్క్స్‌ అలా అని ఉండవచ్చు! మధ్య యుగంలో మతాల పేరా జరిగిన మారణహోమం అంతా ఇంతా కాదు. అయితే మతమౌఢ్యం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక జాతికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాల, జాతుల్లో ఘర్షణలు జరిగాయి. ఆధునిక కాలంలో యూదులపై హిట్లర్‌ హింసాకాండ మత మౌఢ్యానికి ఒక ఉదాహరణ. తాలిబాన్ల కాలంలో మతమౌఢ్యం రాజ్యమేలింది, ఏలుతుంది. అయితే ఈ అన్ని సంఘ టనల్లో బాధితులు మాత్రం మహిళలే. దేశాన్ని భారత మాతగా భావించే మనదేశంలో, మహిళలను పూజించే జంబుద్వీపంలో మహిళలను చెరబడటమా?
ఈ ఆధునిక కాలంలో కూడా మతమౌఢ్యంలో ఉండి పోదామా? ఇంకా తెగలు, జాతులు, మతాల పేరా వైర్యం రాజేద్దామా? దేశ విభజనకు మతమే కారణం. ఆనాడు జరిగిన మరణహోమం అంతా ఇంత కాదు. 1984లో పంజాబ్‌లో జరిగిన అల్లలకు మతానికి సంబంధం ఉంది. ముంబాయిలో జరిగిన అల్లర్లకు మతమే కారణం. 2002లో గోద్రా అల్లరకు, తర్వాత జరిగిన సంఘటనలకు మతమే కారణం కాదా? ఇప్పుడు మణిపూర్‌లో జరిగిన సంఘటన స్థానిక గిరిజన, గిరిజనేతర తెగల మధ్య జరిగిన సంఘటనగా కనిపించినా మతమే అసలు కారణమని అందరికీ తెలుసు. అక్కడ అల్లర్లు ముందు ఎవరు ప్రారంభించారు, న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిదనేది ప్రశ్న కాదు. శాంతి నెలకొల్పాల్సిన పోలీసుశాఖ, న్యాయం చేయాల్సిన న్యాయశాఖా ఏమిచేస్తునట్లు? న్యాయశాఖ(హైకోర్టు) పరిధికి మించి వ్యవహరించడం వల్లేగా మణిపూర్‌ మంటలు అంటుకుంది. రక్షించాల్సిన పోలీస్‌ శాఖ బాధిóతులను రాక్షసులకు అప్పగించి ఉత్సవ విగ్రహాల్లా నిలబడటం వల్లేగా ఆ ఘోరం జరిగింది. ఈ వైఫ ల్యాలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? దేశాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం 355 అధికరణ ప్రయోగించిన ఫలితం రాలేదంటే ఆ వైఫల్యం కేంద్రానిది కాదా? ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ అభిప్రాయమే కాదనలేం. కానీ మైనార్టీ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకో వాల్సిందేగా. ఎవరు ఏమి కోరుకున్నా రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం అది న్యాయబద్దమైతెనేగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. దేశంలో మెజార్టీలు, మైనార్టీలు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీలు, ఓసిలు ఎవరైనా సరే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాల్సిందేగా.
మతవిద్వేషం తలకెక్కిన వారికి మానవత్వం కనిపించదు. అది ఏ ఒక్క మతానికో పరిమితం కాలేదు. ఇప్పటికి తాలిబాన్ల రూపంలోనో, కొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనో చూస్తున్నాం. మన దేశంలో కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం తమ సిద్ధాంతాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. అది మితవాద చర్యల నుంచి మొదలై చివరకు అతి తీవ్రమైన చర్యలుగా పరిణమిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపం నచ్చనివారు ప్రారంభం నుంచి రాజ్యాంగాన్ని అంగీకరించడం లేదు. దేశంలో రాజ్యాంగ పద్ధతుల్లోనే అధికారంలోకి రావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ మితవాద చర్యలతో మొదలై మెల్లగా తమ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర క్రమంగా జరుగుతూనే ఉంది. నేడు అధికరణ 371సి మార్చే కుట్ర మణిపూర్‌లో కావచ్చు, రేపు 371ఎ నాగాలాండ్‌లో కావొచ్చు, 371బీ అస్సాంలో కావచ్చు, 371ఎఫ్‌ సిక్కింలో కావొచ్చు, 371జీ మిజోరాంలో కావచ్చు, 371హెచ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో కావొచ్చు. ప్రస్తుతం మణిపూర్‌ లాంటి డిమాండ్లు రావని గ్యారెంటీ ఏంటి? ప్రకరణ 244(1)5వ షెడ్యూల్‌ ప్రకారం దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలపై, ప్రకరణ 244(2)ఆరవ షెడ్యూల్‌ ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలపై కూడా ఇటువంటి డిమాండ్లు రావని గ్యారెంటీ ఏంటి? వస్తే ప్రభుత్వం మెజార్టీ ఓట్లకోసం రావణ కాష్టం రగిలించినా ఇలాగే చూస్తూ మౌనం వహిస్తుందా?
మతమౌఢ్యం తమ సిద్ధాంతాలను సామ దాన భేద దండోపాయాలతో అమలుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మొన్న కర్నాటకలో హిజాబ్‌ లొల్లి, నిన్న ఢిల్లీ నడివీధుల్లో న్యాయం కోసం రెజ్లర్ల ఆర్తనాదాలు, నేడు తెగల ఘర్షణతో మణిపూర్‌లో మంటలు. కొన్ని రాష్ట్రాల పాలనలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి ”కుటుంబంలో ఇద్దరి వ్యక్తులకు రెండు చట్టాలు ఉంటాయా” అని బలవంతంగానైనా సరే ఉమ్మడి పౌరస్మృతి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించకనే ప్రకటించారు. దేశ మౌలిక స్వరూపమైన భినత్వంలో, ఏకత్వాన్ని కాదనే ఆలోచనలు మానుకోవాలి. మధ్యయుగం కాలం నాటి మత ఆలోచనలు విడనాడాలి. ఏ మతస్తులైన, ఏ కులస్తులైన,ఏ జాతులవారైనా, ఏ తెగలవారైనా అందరికీ రాజ్యాంగ సూత్రాలు వర్తిస్తాయని ప్రజలందరూ గమనించాలి. ఇది ఆధునిక కాలం. ప్రజలకు కావలసింది సమగ్ర సమ్మిళిత అభివృద్ధి. కానీ మతం పేర జాతుల పేర, తెగల పేర ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే పాలన కాదు.

జుర్రు నారాయణ
9494019270