ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలి

– ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్

నవతెలంగాణ – కంటేశ్వర్ 
ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇఫ్లూ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వారిని శిక్షించాలని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని ,లైంగిక దాడులకు పాల్పడ్డ దుండగులను శిక్షించాలని స్థానిక సుభాష్ నగర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేయాలని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.అదేవిధంగా ఇఫ్లూ యూనివర్సిటీలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు సరైనటువంటి వీధిలైట్లు కూడా లేని దుస్థితి నెలకొన్న అక్కడున్నటువంటి అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఎవరైతే విద్యార్థిని పై లైంగిక దాడులకు పాల్పడినటువంటి దుండగులను సస్పెండు చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టే రకంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధిత విద్యార్థినికి న్యాయం జరగాలని పోరాటం చేసిన విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యంగా పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విశాల్ నగర ఉపాధ్యక్షురాలు దీపిక మరియు నగర కమిటీ సభ్యులు గంగ ప్రసాద్, రాహుల్ నగర నాయకులు కార్తీక్, ఆజాద్, దుర్గా, శైలజ, సాయి తదితరులు పాల్గొన్నారు.