‘శాంతి’ ఆలోచనలే సమాజానికి రక్ష

ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌ 21న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఫీస్‌’ కార్యక్రమాన్ని ప్రపంచమంతా నిర్వహిస్తుంది. ‘ప్రపంచశాంతిని నిర్మించాలంటే కేవలం కోర్కెలు ఉన్నంత మాత్రాన సరిపోవని, ప్రపంచ ప్రజలంతా క్రియాశీలమైన పాత్ర పోషించి, అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించుకోవాలని 2023 సంవత్సరం ”యాక్షన్స్‌ ఫర్‌ పీస్‌” అనే థీమ్‌తో ”ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పీస్‌” కార్యక్రమాన్ని ప్రపంచమంతటా నిర్వహించాలని’ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ పిలుపునిచ్చింది. సమాజ పరిణామక్రమంలో భాగంగా ఆదిమ సమాజం నుండి అభివృద్ధి చెందిన నేటి సమాజం వరకు మానవుల ఆలోచనలో, జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ”అభివృద్ధిలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. ఈ కాలంతోపాటు శ్రమిస్తున్న మానవుని ఆలోచనలో, మేధావుల ఆలోచనలో వచ్చిన మార్పుల ఫలితంగానే జరిగాయి. ఈ క్రమంలో అనేక యుద్ధాల అనుభవాల నుండి ఎంతోమంది మేధావులకు కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. యుద్ధం వల్ల జరుగుతున్న ప్రమాదం, కష్టనష్టాలు, పాలకుల బాధ్యతలపై చర్చలొచ్చాయి.
ఐన్‌స్టీన్‌ చెప్పినట్లుగా ‘మన ఆలోచనల్ని బట్టి మనం సృష్టించుకునే సమాజం ఉంటుందని’ ప్రపంచం నమ్మింది. ఫలితంగా యుద్ధాలను, శాంతిని, గురించి ఆలోచించి ఈ రెండింటిలో ఏది మానవ సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది? ఏది విధ్వంసాన్ని, నష్టాలను కలగజేస్తుంది అని ఆలోచించటం వల్ల ప్రపంచం శాంతియుతమైన సమాజం కావాలని ఆలోచనకు బలాన్ని, నిర్మాణాన్ని, కార్యరూపాన్ని ఇవ్వాలనుకుంటూ అటువైపుగా పయనిస్తుంది. వీటికి భిన్నంగా సామ్రాజ్యవాద శక్తులు మాత్రం యుద్ధ ఆలోచనలో మునిగి తేలుతూ దేశాల మధ్య తగాదాలు పెట్టి ఆయుధ వ్యాపారం చేసి లబ్ది పొందాలనుకుంటున్నాయి.
17వ శాతాబ్దం పార్రంభంలో ఫ్రాన్స్‌ నాయకులలో ఒకరైన ”డుక్‌ డి సిల్లీ”, అటు తర్వాత శాంతి ఉద్యమాల మద్దతు దారులు ”బెంజిమిన్‌ ప్లాంకిన్‌” యుద్ధం శాంతి గురించి విశ్లేషించాడు. రాజ్యంలో ఎక్కువ సైన్యం ఉంటే మరొక రాజ్యంపై దాడి చేస్తారు. ఎక్కువ జనాభా ఉంటే సైన్యంలోకి ఎక్కువమంది వస్తారు. మితిమీరిన సైన్యంతో రాజ్యాల మీద దాడులు జరుగుతుంటే చాలా మంది చంపబడుతారనీ, కాబట్టి జనాభాను, సైన్యాన్ని తగ్గించాలన్నారు. ఆరోజుల్లోనే ఆయనలో సైన్యం మీద ఖర్చు ఎక్కువ పెట్టవద్దన్న ఆలోచన మొదలైంది. యుద్ధాలను నియంత్రించాలని, ప్రజలను కాపాడుకోవాలని, వారిని అభివృద్ధి పథంవైపు నడిపించాలని, శాంతిని స్థాపించాలని పేర్కొన్నాడు. అంతేకాదు ”అధికారిక సైనిక స్థావరాలు ఏ విధమైన ప్రభుత్వంలోనూ స్వేచ్చకూ, సేచ్చా యుతమైన జీవితాలకు సమంజసమైనవి కావు, పైగా ‘రిపబ్లికన్ల’కు విరుద్దమైనవిగా పరిగణించ బడతాయని” ఆయన ప్రపంచహితం, ప్రపంచ శాంతిని స్థాపన కోరి చెప్పిన మాటలు ఇప్పటికీ అన్ని దేశాల పాలకులకు అనుసరణీయమైనవి. కానీ ప్రపంచంలో ఏమి జరుగుతుంది? ఈ ప్రపంచం ఏమి కోరుకుంటుంది? వివిధ దేశాలలో అధికారంలోకి వచ్చిన ”పాలకులు” ఏమి చేస్తున్నారు? అనేది నేడు ఆలోచించాలి. పాలకుల మీద ప్రపంచ శాంతి ఆలోచనల గురించి చర్చించే ఒత్తిడి తీసుకురావాలి.
1846 సంవత్సరంలో శాంతిని కోరుతూ ”ఎలీహబర్రీట్‌” యూనివర్సల్‌ బ్రదర్సహుడ్‌ ‘లీగు’ను స్థాపించాడు. దానికి బలం చేకూర్చటానికి, ఆనాడే 20 వేల మంది బ్రిటిష్‌ సభ్యత్వాన్ని, 20వేల మందిని అమెరికన్‌ సభ్యత్వంలో చేర్పించి దాన్ని ప్రకటించాడు. శాంతి గొంతుకను వినిపించాడు. శాంతికోసం ఎనలేని కృషి చేశాడు. ప్రపంచంలో ‘యుద్ధం’ జరిగిన ప్రతిసారి, దానికి భిన్నంగా ‘శాంతి’ ఆలోచన సమాజంలో పుడుతుంది. అలా ఎవరికి వారు ఆలోచించటం మొదలు పెట్టారు. అందుకు మేధావులు, కవులు, రచయితలు, సైంటిస్ట్లు, కళాకారులు, డాక్టర్లు, లాయర్లు, సినిమా రంగానికి చెందిన యాక్టర్లు, దర్శకులు, మహిళలు, శాంతి ఉద్యమకారులు, శ్రేయోభిలాషులు అనేక సందర్భాలలో జరిపిన సమావేశాలు, సమాలోచనల ఫలితంగా శాంతి ఉద్యమ ఆలోచనలు బలపడ్డాయి. ‘ప్రపంచ శాంతి’ ఆలోచనకు బలం చేకూరింది. ఆ వాతావరణంలోనే వివిధ దేశాలలో శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. 1917లో అక్టోబర్‌ విప్లవం విజయవంతమైంది. ఈ కాలంలోనే (యుద్ధకాలంలో) ఏరులైపారుతున్న రక్తపునేల మీద లక్షలాది రష్యన్‌ మహిళలంతా పిడికిళ్లు బిగించి ‘మాకు యుద్ధం వద్దు, శాంతి కావాలి, ఆహారం కావాలి’ అంటూ వీధుల్లోకి వచ్చి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన శాంతి ప్రదర్శన ప్రపంచానికి ఆదర్శనీయమైనదిగా నిలిచింది. సోషలిస్టు మహోద్యమ నాయకుడు కామ్రేడ్‌ లెనిన్‌ 1917 అక్టోబర్‌ 26న శాంతి డిక్రీని ప్రవేశపెట్డాడు. దేశాల మధ్యన శాంతి ప్రాధాన్యతను, తక్షణ అవసరాన్ని, ఆదర్శవంతమైన సూత్రాలను ప్రపంచ దేశాల ప్రజల మీదుంచి, శాంతిస్థాపనకు ఆయన ఆదర్శంగా నిలిచాడు.
ఓవైపు ప్రపంచశాంతి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. మరొకవైపు సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం, అహింస, అసహనం, టెర్రరిజం జాత్యాహంకారం, మతోన్మాదం, పేట్రేగిపోతోంది. వివిధ దేశాలమధ్య యుద్ధాలు సాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ నిబంధనలను, సూత్రాలను పట్టించుకోకుండా సైనికబడ్జెట్‌ను విపరీతంగా పెంచుతున్నారు. సామ్రాజ్యవాద, యుద్ధోన్మాద దేశాలు, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించకుండా, వాటిపై దాడులు చేస్తున్నాయి. అంతేకాకుండా ఆయా దేశాల్లోని సహజ వనరుల మీద పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, దోపిడీ రహదారులకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. భూమ్మీద శాంతి సుస్థిరత, అభివృద్ధికి అగాధం కల్పిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం, శాంతియుతమైన పరిష్కార ప్రతిపాదన పద్ధతుల ద్వారా శాశ్వత పరిష్కారానికి తీవ్రమైన కృషి చేయటం లక్ష్యంగా సాగుతుంది. ఇది ఏదో ఒక సంవత్సరం, లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే పనిచేసి మౌనంగా కూర్చుంటే కుదరదు. అలాగే ఎవరో ఒకరు మాత్రమే, ఒక సంస్థ మాత్రమే పనిచేస్తే లక్ష్యం నేరవేరదు. శాంతిసాధన ఉద్యమం నిరంతర ప్రక్రియ. ఇది సజీవశాంతి. ఉద్యమ నదిలా నిరంతరం సాగుతుండాలి. అందరూ దీని గురించి ఆలోచించాలి. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జరిగే కవిసమ్మేళనాన్ని జయప్రదం చేయాలి.
కె.వి.ఎల్‌
733067737