వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి?

– బీఆర్‌ఎస్‌ నేతలకు మహేష్‌కుమార్‌ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తొమ్మిదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలకు వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బీఆర్‌ఎస్‌ నేతలు…ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్‌ఎస్‌ నేతలను హెచ్చరించారు. చిన్న, చిన్న పదవుల కోసం ఆరాటపడే బీఆర్‌ఎస్‌ నాయకులు… ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించిన సోనియగాంధీ గురించి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.
ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా మోడీ ప్రవర్తన : జి నిరంజన్‌
ప్రధాన నరేంద్రమోడీ ప్రవర్తన ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ విమర్శించారు. రాజ్యాంగ పీఠికలోని సెక్యూలర్‌ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే మోడీ దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని సష్టిస్తున్నారని చెప్పారు. దేశంలో మతసామరస్య వాతావరణాన్ని కాపాడాలంటే మోడీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.