జహంగీర్ నామినేషన్ రోడ్ షోకు వేలాదిగా తరలిరండి..

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ..
నవతెలంగాణ – మునుగోడు
నేడు భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే భారీ రోడ్డు షోకు  మునుగోడు నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) బోనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను పార్లమెంటుకు పంపేందుకు ప్రజలను కోరారు. భువనగిరి గడ్డపైన సీపీఐ(ఎం) గెలిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో ప్రజా గొంతుకై కమ్యూనిస్టులు వినిపిస్తారని తెలిపారు. పది సంవత్సరాలుగా దేశాన్ని  పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగమును పెంచి పోషించిందని అన్నారు. వీర తెలంగాణ  రైతాంగ సాయుధ పోరాటంలో  కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఎర్రజెండదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు దొండ ఎంకన్న, బి మల్లేశం , బి కిరణ్ , బి మల్లేశం , బోడిసె మహేందర్, జంగయ్య, బొడిసే రామకృష్ణ, బొడిసే నరసింహ, గోపమ్మ, అండాలు, ప్రమీల తదితరులు ఉన్నారు.