
– నిందితుల నుండి 73.825 కేజీల గంజాయి స్వాధీనం
– స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 18.45 లక్షలు
– నిందితుల నుండి 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఒడిస్సా నుండి ఉత్తరప్రదేశ్ కు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీసులు కొర్లపాడు స్టేజి వద్ద పట్టుకున్నారు. వీరి నుండి 73. 825 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని 89 ప్యాకెట్ల ను చేసి రవాణా చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పి కే. శివరామిరెడ్డి చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 18,45,625 రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడ్డ గంజాయి, నిందితుల వివరాలను డి.ఎస్.పి శివరాం రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా గౌతమ్ బుద్ధ నగర్ కు చెందిన అశోక్ కుమార్, మొరాదాబాద్ కు చెందిన దీపు కుమార్, ఢిల్లీకి చెందిన సుష్మా రాయ్ లు యూపీ 19 జె 0018 నెంబర్ గల వెర్నా కారులో ఒడిస్సా లోని కలిమెల, మల్కాన్ గిరి నుండి గంజాయిని ఉత్తరప్రదేశ్ కు తీసుకెళ్తుండగా కొర్లపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారని డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులు మల్కాన్ గిరి వద్ద సుశాంత్ బడాయి వద్ద 89 ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేసి దాన్ని ఉత్తరప్రదేశ్ లో ప్రేమ్ సింగ్ కు అందజేసేందుకు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రేమ్ సింగ్, సుశాంత్, బడాయిలు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుండి 5 సెల్ ఫోన్లు, వెర్నా కారును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గంజాయిని చేరవేసినందుకు ప్రేమ్ సింగ్ ఒక్కొక్కరికి 20వేల రూపాయలను అందిస్తాడని ఆయన తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన శాలిగౌరారం సిఐ కే. కొండల్ రెడ్డి, కేతేపల్లి ఎస్సై శివతేజ, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు, ఎస్సైలు మహేందర్, మహేష్, సిబ్బంది ప్రభాకర్, కొండల్, లక్ష్మీ ప్రసాద్, శ్రీను, లింగరాజు, గిరిలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.