ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు ఖరారు

– అందరూ బీసీలే
– ఖరారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి
నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో  నాలుగు ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు సీపీఐ(ఎం), బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను  ప్రకటించాయి.  భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా మొదటి నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిది బిక్షమయ్యగౌడ్ పేర్లు వినబడ్డాయి .చివరకు ఇబ్రహీంపట్నం కు చెందిన క్యామ మల్లేష్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఖరారయ్యారు. అభ్యర్థి ఖరారులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రిగా పనిచేసిన ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే జిట్టా బాలకృష్ణారెడ్డికి షరా మామూలుగా టికెట్ దక్కలేదు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్ ను ప్రకటించారు. ఈ ప్రాంతానికి బిఆర్ఎస్ అభ్యర్థి అంతగా పరిచయం లేరు.
అభ్యర్థిని ఖరారు చేయని కాంగ్రెస్:
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పలువురు పోటీ పడుతుండగా చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి, పేరు వినబడుతుంది మరోవైపు ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు చక్కర్లు కొడుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి టికెట్ వస్తుందని మొదటి నుండి వినబడ్డ శుక్రవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో అలాంటిది ఏమీ లేదని తను టికెట్ కోరడం లేదని ప్రకటన చేశారు. ఎంపీ టికెట్ కోమటిరెడ్డి లక్ష్మికి కోరుతున్నామని కొన్నిపత్రికలలో ఛానల్ లో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుఅని తెలిపారు.
ముగ్గురు  అభ్యర్థులు బీసీలే:
ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ ను, సీపీఐ(ఎం) అభ్యర్థిగా మైనార్టీ బీసీకి చెందిన ఎండి జహంగీర్ ను, బీఆర్ఎస్  అభ్యర్థిగా యాదవ కురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ యాదవ్ ను కేటాయిస్తూ ఆ మూడు పార్టీలు బీసీలకే కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.