నవతెలంగాణ – చొప్పదండి/నిజాంసాగర్
కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో ఎండ తీవ్రతకు తట్టుకోలేక మంగళవారం ముగ్గురు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన రైతు ఐతరవేణి రాజేశం(49) గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను నేర్పడానికి వెళ్లాడు. ఎండకు తట్టుకోలేక అక్కడే మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
సీఎం సభకు వచ్చిన మహిళ మృతి
జమ్మికుంటలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ వడదెబ్బకు గురైంది. సభ అనంతరం ఇంటికెళ్లే క్రమంలో ఒక్కసారిగా కూప్పకూలి పరిస్థితి విషమించి మరణించింది.
వృద్ధురాలు మృతి
కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని గిర్నీ తండాకు చెందిన కడవత్ హిరి(65) రెండ్రోజులుగా వరి ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి కుప్పలు చేసింది. అయితే ఎండ తీవ్రంగా ఉండటంతో అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు.