రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

– ఢీకొన్న‌ రెండు కార్లు.. రెండు లారీలు
– నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘటన
నవతెలంగాణ- చిట్యాల
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన నల్లగొండ చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ వెనుక రెండు కార్లు వెళ్తున్నాయి. వెనుక ఉన్న కారు ముందు కారును ఢకొీట్టింది. దాంతో ముందున్న కారు డివైడర్‌ను దాటి విజయవాడ వైపు వెళ్లే రహదారిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముందున్న కంటైనర్‌ డ్రైవర్‌ ఆందోళనకు గురవ్వడంతో అదుపు తప్పి డివైడర్‌ను దాటి హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీని ఢకొీట్టింది. ఈ ఘటనలో కుడివైపు దూసుకెళ్లిన కారును లారీ ఢకొీట్టడంతో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎండి నహీం(40), సయ్యద్‌ మిస్బాయిద్దీన్‌(45) అక్కడికక్కడే మృతిచెందారు. మహమ్మద్‌ యూసుఫ్‌ హుస్సేన్‌, సలీంకు గాయాలవ్వగా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ హుస్సేన్‌(50) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సలీంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వీరంతా హైదరాబాద్‌ వాసులు. పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు వైపులా ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివరాంరెడ్డి తెలిపారు.