– ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం రాగిజావ
– దసరా తర్వాత అన్ని సర్కారు బడుల్లోనూ అమలు
– పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
– 27,147 స్కూళ్లలో 23 లక్షల మందికి ప్రయోజనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మూడుపూటలా పౌష్టికాహారం అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. అందులో భాగంగానే ఈనెల ఆరున ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు ఒక్కో రోజు ఒక్కో వంటకాన్ని అందించనుంది. అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మెనూను రూపొందించింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొత్త మెనూను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోని విద్యార్థులకు వారంలో ఒక రోజు వెజ్‌బిర్యానీని అందిస్తున్నది. ఇంకోవైపు విద్యార్థులకు వారంలో మూడు రోజులపాటు ఉదయమే రాగిజావ అందించింది. మరోవైపు వారంలో మూడు రోజులు గుడ్డు ఇస్తున్నది. అయితే ఈనెల ఆరున ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం రాగిజావను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దసరా తర్వాత రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలకు సమాచారం. వెళ్లింది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలవుతున్న 119 నియోజకవర్గాల్లోని గెజిటెడ్ హెచ్‌ఎంలతో విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సమావేశాన్ని నిర్వహించారు. ఆ పథకం అమలవుతున్న తీరుతెన్నులు, వస్తున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉదయం అల్పాహారం, తర్వాత రాగిజావ అందించడం వల్ల పాఠశాలల్లో తరగతుల బోధనకు ఇబ్బందులు వస్తున్నాయని హెచ్‌ఎంలు వివరించారు.
ఇంకోవైపు విద్యార్థులు ఎక్కువ సమయం అల్పాహారం, రాగిజావ కోసం కేటాయించాల్సి వస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం అల్పాహారం, తర్వాత మధ్యాహ్న భోజనం, సాయంత్రం రాగిజావను అందించాలని నిర్ణయించారు. దానివల్ల విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు.
హాజరు పెరుగుదల డ్రాపౌట్లు తగ్గుదల
ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని అమలుచేస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు.
దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించడం, హాజరు శాతం పెరగడానికి దోహదపడుతుంది. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.672 కోట్లు ఖర్చు చేస్తున్నది. మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందిస్తున్నది. సన్న బియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం రూ.120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తున్నది. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.32 కోట్లతో రాగి జావను ఇస్తున్నది.