స్టాకహేోమ్ : భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఈ సంవత్సరం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తినీ, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నే ఎల్ హ్యూలియర్‌లకు రాయల్ స్వీడిష్ సైన్స్ అకాడమీ మంగళవారం అవార్డులు ప్రకటించింది. ఎలక్ట్రాన్ల పరిశీలనను సులభతరం చేయడానికి కృషి చేసినందుకు వీరికి నోబెల్ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం కింద పది లక్షల డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.
ఎలక్ట్రాన్ డైనమిక్స్‌పై అధ్యయనం చేసే ప్రక్రియలో ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పద్ధతులు కీలకమైనవి. ఎందుకంటే పరమాణువులు, అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు వేగంగా ఉంటాయి. వీటిని ఆటో సెకండ్లలో కొలుస్తారు. అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలు చేయడం వల్ల వీరిని ఎంపిక చేశామని స్వీడిష్ సైన్స్ అకాడమీ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ చెప్పారు.