జైళ్ల శాఖలో ముగ్గురు అధికారులకు పదోన్నతులు

నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
రాష్ట్ర జైళ్ల శాఖలో ముగ్గురు అధికారులకు పదోన్నతులు ఇస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. చర్లపల్లి జైళ్లో అసిస్టెంట్‌ జైలర్‌గా ఉన్న వై. వెంకట్‌రెడ్డికి డిప్యూటీ జైలర్‌గా పదోన్నతినిచ్చి ఆయనను నల్గొండ జైలుకు బదిలీ చేశారు. అలాగే, చంచల్‌గూడ సెంట్రల్‌ ప్రిజన్స్‌లో అసిస్టెంట్‌ జైలర్‌గా ఉన్న రాజేందర్‌బాబుకు డిప్యూటీ జైలర్‌గా పదోన్నతినిచ్చి అదే విభాగంలో కొనసాగేలా ఆదేశాలిచ్చారు. మహబూబ్‌నగర్‌ జైళ్లో అసిస్టెంట్‌ జైలర్‌గా ఉన్న సుధాకర్‌రెడ్డికి డిప్యూటీ జైలర్‌గా పదోన్నతినిచ్చి అక్కడే కొనసాగమని ఉత్తర్వులిచ్చారు. కాగా, జైళ్ల శాఖలోనే చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వార్డర్లు, హెడ్‌ వార్డర్లతో పాటు మరికొందరు అధికారులకు జైళ్ల డీజీ త్వరలోనే పదోన్నతులు ఖరారు చేయనున్నట్టు తెలిసింది.