మూడు పార్టీలే

– ఎలక్టోరల్‌ బాండ్ల కోసం 2018, మార్చి నాటికి ఎస్‌బీఐ ఖాతాలు తెరిచింది ఇవే
– ఈనెల 21 నాటికి 25కు చేరిన రాజకీయ పార్టీల సంఖ్య
– ఆర్టీఐ సమాచారం
న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాల కోసం 2018, మార్చి 31 నాటికి కేవలం మూడు పార్టీలు కరెంట్‌ ఎస్‌బీఐ కరెంట్‌ ఖాతాలు తెరిచాయి. ఈ విషయాన్ని ఆర్టీఐ సమాచారం కింద ఎస్‌బీఐ వెల్లడించింది. రిటైర్డ్‌ కమోడోర్‌ లోకేశ్‌ బాత్ర దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్‌బీఐ సమాచారాన్ని అందించింది. ఎస్‌బీఐ సమాచారం ప్రకారం.. ఎల్‌క్టోరల్‌ బాండ్ల ఎన్‌క్యాష్‌ కోసం 2018, మార్చి 31 నాటికి మూడు రాజకీయ పార్టీలు మాత్రమే ఖాతాలను తెరిచాయి. 2019, మార్చి 31 నాటికి ఈ సంఖ్య 14కు పెరిగింది. కొన్ని రోజులకు అదే ఏడాది ఏప్రిల్‌ 12న ఖాతాలు తెరిచిన రాజకీయ పార్టీల సంఖ్య 18కి చేరింది. 2020, మార్చి 31 నాటికి ఈ సంఖ్య 22కు చేరగా.. తర్వాతి ఏడాది మార్చి 31 వరకు అలాగే ఉన్నది. 2022, మార్చి 31 నాటికి 24, ఆ తర్వాత ఏడాది అదే తేదీ నాటికి 25 రాజకీయ పార్టీలు ఖాతాలను కలిగి ఉన్నాయి. ఈ నెల 21 నాటికి కూడా ఈ సంఖ్య ఇలాగే కొనసాగటం గమనార్హం.