– సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒక్క ఓటుతో మూడు పార్టీలను దెబ్బకొట్టాలని సీపీిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, ఇటి నర్సింహాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ దాని మితృలైన ఎంఐఎం, బీజేపీిలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌తో పాటు కొత్తగూడెంలో సీపీఐకి ఓటేసి గెలిపించాలని కోరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీిఎం, టీజేఎస్, ప్రజాపంథా మద్దతిస్తున్న సీపీిఐకి గెలుపుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కోదండరామ్, సీపీఐలను కేసీఆర్ పక్కనబెట్టారని తెలిపారు. ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన తలసాని , ఎర్రబెల్లి వంటి వారిని క్యాబినెట్ మంత్రులుగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం బీఆర్‌ఎస్ మితృలయ్యారనీ, మరో పక్క బీజేపీతోనూ స్నేహం చేస్తున్నారని తెలిపారు. అందుకే ఆ మూడు పార్టీలను ఓడించాల న్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకిి ఓటేయడమేనని తెలిపారు. అభివృద్ధి చేశామని అందుకే తమకు ప్రజలు ఓట్లేస్తారని బీఆర్‌ఎస్ భావిస్తోందనీ, కానీ.. క్షేత్ర స్థాయిలో దానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం నుంచి మొదలు పేపర్‌లీకేజీలు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు తదితర హామీలన్నింటిలో ఫెయిలయ్యారని తెలిపారు. కాళేశ్వరం కడితే పిల్లర్ సహా కూలిపోయిందని ఎద్దేవా చేశారు. పది శాతం ఉన్న కమిషన్‌ను బీఆర్‌ఎస్ 50 శాతానికి పెంచిందని విమర్శించారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ హైదరాబాద్‌లో రిగ్గింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. చాడ మాట్లాడుతూ ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థులపై జరిగిన దాడులపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.