– ఈవీఎం యంత్రాలను సీల్ చేసి 15 డీఆర్ కేంద్రాలకు తరలింపు
– అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఈవీఎం యంత్రాలు
– పోలింగ్ సరళిపై ఓటర్లు, నాయకుల ఆరా
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌లో సార్వత్రిక ఎన్నికల పోరు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. దాదాపు నెల రోజులుగా హౌరాహౌరీగా కొనసాగిన ప్రచారం సోమవారం ముగియడంతో అంతా పోలింగ్ సరళిపై దృష్టి సారించారు. రాజకీయ నాయకులు, నగరవాసులు, అభ్యర్థులు, వారి అనుచరులు, ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థినే విజ యం సాధిస్తారని ధీమాలో ఉన్నారు. అయితే విజేత ఎవరో తేలాలంటే వచ్చే నెల 4వ తేదీ వరకు నిరీక్షించాల్సిందే. అప్పటి వరకు అన్ని పార్టీ నాయకుల్లో ఉత్కంఠ తప్పదు.
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం యంత్రాలను ఎన్నికల ఏజెంట్లు, అధికా రుల సమక్షంలో (బ్యాలెట్ బాక్స్‌లను) సీల్ చేశా రు. అనంతరం ఈవీఎం మెషిన్లను ఆయా ప్రాంతాలల్లో ఏర్పాటు చేసిన 15 డీఆర్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితోపాటు నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్‌పీఎఫ్, సివిల్, స్థానిక పోలీస్ సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వైపు ఎవరిని అనుమతించరు.
అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా…
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చార్మినార్, యాకుత్‌పూర, కోఠి మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో గోషామహల్, అంబర్ పేట, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో మలక్‌పేట, బండ్లగూడలోని ఆరోరా యూనివర్సిటీలో బహద్దూర్ పూర అసెంబ్లీ సెగ్మెంట్, నిజాం కళాశాలలో చంద్రయాన్ గుట్ట, అసెంబ్లీ సెగ్మెంట్, మాసాబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం యంత్రాలను భద్రపరిచారు.
సికింద్రాబాద్…
ఇక సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకర్గ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఈవీఎం లను భద్రపరిచారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్ ఏయూలో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎంలను భద్రపరిచారు. దోమలగూడలోని ఏవీ కాలేజీలో ముషీరాబాద్, నారాయణగూ డలోని రెడ్డికాలేజీలో అంబర్‌పేట్ నియోజకవర్గానికి సంభందించిన ఈవీఎంలను భద్రపరిచారు. ఓయూలో సనత్‌నగర్, ఫ్రొఫెసర్ జీ.రామ్‌రెడ్డి సెంటర్‌ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (ఓయూ)లో సికింద్రాబాద్ నియోజక వర్గం ఈవీఎంల ను భద్రపరిచారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరిలకు సంబంధించి ఈవీఎంలను, యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌కు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు.