చెరువులో పడిన బాలుడ్ని కాపాడబోయి.. ముగ్గురు మహిళలు మృతి

– నలుగురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం
– ముగ్గురిని బయటకు తీసిన గ్రామస్తులు
– బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు
నవతెలంగాణ-తూప్రాన్‌ రూరల్‌/మనోహరాబాద్‌
ఆనందంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన ఆ కుటుంబంలో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. పండగకు వచ్చిన ఆ కుటుంబంలో బాలుడు నీట మునగడంతో .. అతన్ని కాపాడబోయి.. ముగ్గురు మహిళలు ఒక్కసారిగా చెరువులో పడి నీట మునిగి మృతి చెందారు. కాగా, మహిళల మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీసినప్పటికీ బాలుడి శవం ఇంకా దొరకలేదు. దాంతో గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయిపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాయిపల్లి గ్రామంలో ఆదివారం దళితులు.. గ్రామదేవతలకు బోనాల పండుగను నిర్వహించుకున్నారు. కాగా గ్రామానికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంటికి బోనాల పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన అతని బావమరుదుల భార్యలు దొడ్డ బాలమణి(30) ఆమె కుమారుడు చరణ్‌(6), దొడ్డ లక్ష్మి(25) చుట్టపు చూపుగా వచ్చారు. కాగా, సోమవారం మధ్యాహ్నం సమయంలో దొడ్డ బాలమణి ఆమె కుమారుడు చరణ్‌, తోటికోడలు దొడ్డ లక్ష్మితోపాటు ఫిరంగి చంద్రయ్య కూతురు లావణ్య(20) కలిసి గ్రామ పెద్ద చెరువు బతుకమ్మ మెట్ల వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారు. అదే సమయంలో చరణ్‌ నీటిలో ఆడుతూ కాలుజారి మునిగిపోయాడు. అక్కడే ఉన్న అతని తల్లి బాలమణి కొడుకును కాపాడేందుకు నీటిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు ఆమె కూడా మునిగి పోయింది. దాంతో గట్టుపై ఉన్న ఇద్దరు మహిళలు కాపాడటానికి నీటిలోకి వెళ్ళగా వారు కూడా మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వచ్చి నీటిలో మునిగి మృతి చెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను బయటకు తీయగా బాలుడి కోసం వెతికారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మనోహరాబాద్‌ ఎస్‌ఐ కరుణాకర్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాలుని శవం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒకే రోజు గ్రామంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మనోహరాబాద్‌ ఎస్‌ఐ కరుణాకర్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.