– బిల్‌గేట్స్ అంచనా
న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఎఐ)తో మనుషుల పనులు సులభతరం అవుతాయని మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్ అన్నారు. పని గంటలు కూడా తగ్గుతాయన్నారు. అధునాతన టెక్నాలజీతో వారానికి మూడు పనిదినాల విధానం అందుబాటులోకి రావొచ్చన్నారు. మైక్రోసాఫ్ట్ ఎఐ ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్న బిల్‌గేట్స్ ఎఐతో సమూల మార్పులు రానున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎఐ కీలక మార్పులకు దారితీయనుందన్నారు. దశాబ్ధాలుగా అనుసరిస్తున్న వారానికి ఐదు పని దినాల పద్ధతికి ఎఐతో స్వస్తి పలికే అవకాశం ఉందన్నారు. వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేసే సమాజంలోకి మనం మారితే అది ఆమోదయోగ్యమేనని అన్నారు. ఇక మరో ఐదేళ్లలో ఎఐ మానవ మేథస్సును అధిగమిస్తుందని ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ అంచనా వేశారు. వచ్చే ఏడాది నుంచే మానవుడి కంటే ఎఐ తెలివిగా వ్యవహరించడం ప్రారంభిస్తుందని ట్వీట్ చేశారు. కాగా.. మస్క్ అభిప్రాయంతో మెటా చీఫ్ ఎఐ సైంటిస్ట్ యాన్ లికున్ విభేదించారు. ఎఐ మానవుల కంటే తెలివి మీరబోదని విశ్లేషించారు.