నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరిస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నేచురుల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశారు ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. నేటి నుంచి (శుక్రవారం) నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ”13బి’ తర్వాత నేను సూపర్ నేచురల్ జోనర్‌లో సినిమాలు చేయలేదు. ‘దూత’ ఆలోచన ఎప్పట నుంచో ఉంది. నాగ చైతన్యకి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. చాలా మలుపులు ఉంటాయి. లాంగర్ ఫార్మెట్‌లో ప్రతి ఎపిసోడ్‌కి ఒక మలుపు ఉండాలి. కథతో పాటు ప్రేక్షకుడిని చివరి వరకూ తీసుకెళ్ళాలి. ఇదొక పెద్ద సవాల్. రైటింగ్ ప్రాసెస్‌ని చాలా ఎంజారు చేశాను. ఈ షో పై ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దూత అంటే మెసేంజర్.
ఒక సంఘటనని ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతనే. ఇదొక జర్నలిస్ట్ నేపథ్యంలో జరుగుతుంది. ఓటీటీకి ఓ గొప్ప సౌలభ్యం ఉంది. ఇప్పుడు విడుదలౌతున్న దూత దాదాపు 240 దేశాల్లో ప్రసారం కానుంది. ప్రపంచంలో నలుమూలల ప్రేక్షకులు చూస్తారు. దూత సూపర్ నేచురల్ జోనర్ కాబట్టి ఇలాంటి జోనర్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మన షోని కూడా వాళ్ళు ఎంజారు చేయడం మంచి అనుభూతి. జర్నలిస్ట్ అంటే చాలా పవర్‌ఫుల్ రోల్. ప్రజాస్వామ్యంలో జర్నలిజం ఒక మూలస్థంబం. అందులోనూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చాలా రిస్క్ ఉంటుంది. ఆ వృత్తిలో ఉండాలంటే చాలా గట్స్ కావాలి. అందరూ ఆ పని చేయలేరు. ఈ కథలో అలాంటి పాత్రని చాలా అద్భుతంగా చిత్రీకరించాం. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో చాలా లేయర్లు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. దూతని గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఎపిసోడ్‌ని స్క్రీన్ చేశాం. నిర్మాణం పరంగా ఇది చాలా ప్యాషన్‌తో కూడుకున్న సిరీస్. శరత్ మరార్‌లాంటి ప్యాషనేట్ నిర్మాత వలనే ఇది సాధ్యమైంది. మూడు సినిమాల నిడివి ఉన్న కంటెంట్ ఇది. దాదాపు సన్నివేశాలన్నీ వర్షంలోనే చిత్రీకరించాం’ అని చెప్పారు.