– కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న అభ్యర్థిత్వాలు
– పొంగులేటి పోటీ చేసే స్థానంపై ఆసక్తి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం అవుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. మీడియాల్లో వస్తున్న పేర్లపై స్పష్టత కోసం ఆయా పార్టీల శ్రేణులు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి కొన్ని మీడియాల్లో ఐదుగురు సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఖరారు అయినట్టు వార్తలు వస్తుండగా.. మరికొన్ని ఏడుగురు, తొమ్మిది మందని వెల్లడిస్తున్నాయి.
కమ్యూనిస్టులు, బీఆర్‌ఎస్ పొత్తు అంశం ఓ కొలిక్కి రాకముందే వెలువడుతున్న ఈ జాబితాలపై ఆయా పార్టీల శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. కమ్యూనిస్టుల కేంద్రీకరణ నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న కథనాలు నమ్మశక్యం కాకపోవచ్చనే అభిప్రాయం పలువురి నుంచి వెలువడుతోంది. మరోవైపు పోటీ కోసం దరఖాస్తుల ప్రక్రియను కాంగ్రెస్ శుక్రవారం నుంచి ప్రారంభించింది.
పుకార్లు షి’కారు’..!
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాపై పుకార్లు షి’కారు’ చేస్తున్నాయి. వైరా మినహా మిగిలిన అభ్యర్థుల జాబితా అంతా క్లియర్.. సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఖరారు అయినట్టు వస్తున్న వార్తల్లో నిజమెంత అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకుగాను ఐదుగురు అభ్యర్థుల విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. వీరిలో ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజరుకుమార్, సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, పినపాక రేగా కాంతారావు, అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు బాణోత్ హరిప్రియల విషయంలో ఒకింత స్పష్టత ఉండగా.. మిగిలిన స్థానాలపై సందేహాలు నెలకొన్నాయి. 21వ తేదీన సీఎం కేసీఆర్ తొలి జాబితా ప్రకటించే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
‘హస్తం’ ఆచితూచి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాల విషయంలోనూ మీడియాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురికి టిక్కెట్లు ఖరారైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం మొదలవ్వగానే మొదటి దరఖాస్తు జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మానవతారారు సమర్పించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీ లించిన అనంతరం పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల జాబితా తయారు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అశ్వారావుపేట ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేశారు. పొంగులేటిపై తాటి చేసిన కామెంట్స్‌ను మానవతారారు ఖండించారు. వివిధ నియోజకవర్గాల్లో పొంగులేటి తరఫు అభ్యర్థులుగా భావిస్తున్న నేతలు మాత్రం ‘చాపకింద నీరులా..’ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా నుంచి భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కతో పాటు పొంగులేటికి మాత్రమే ప్రస్తుతానికి టిక్కెట్లు ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
పొంగులేటి పోటీ ఎక్కడ…?
దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెంల నుంచి దరఖాస్తు చేస్తారని తెలుస్తోంది. దీనిలో సర్వేలో మెజార్టీ వచ్చిన స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో ఇల్లు నిర్మించి, కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఇది వ్యూహంలో భాగమని, ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుచరుల్లో అత్యధికులు చెబుతున్నారు. పొత్తులు, ఎత్తులు కొలిక్కి వస్తేగానీ పొంగులేటి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత వస్తుందని విశ్లేషకుల అంచనా.