ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత

For IPL matches Strong security– మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచే అనుమతి
– 2800 మందితో భారీ బందోబస్తు
– 360 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
– పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు రంగంలోకి షీ టీమ్స్‌
– అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
– ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి
– రాచకొండ సీపీ తరుణ్‌ జోషీ
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ -17 షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 27, వచ్చే నెల 5న రాత్రి జరిగే మ్యాచ్‌లకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తులో 2,800 మంది పోలీసులుంటారని రాచకొండ సీపీ తరుణ్‌ జోషీ తెలిపారు. 360 సీసీ కెమెరాల నిఘా మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ కొనసాగుతుందన్నారు. మెడికల్‌ టీమ్స్‌తోపాటు అంబులెన్స్‌, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. బుధవారం(నేడు) రాత్రి సన్‌ రైజర్స్‌ – ముంబయి ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పద్మజతో కలిసి సీపీ మాట్లాడారు.
ఐపీఎల్‌ -17 షెడ్యూల్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. అక్టోపస్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌, ట్రాఫిక్‌, సీసీఎస్‌, ఎస్‌వోటీ, లా అండ్‌ ఆర్డ్‌తోపాటు ఇతర సెక్యురిటీ వింగ్‌లను రంగంలోకి దించామన్నారు. అదనంగా బాంబ్‌, డాగ్‌ స్వ్కాడ్స్‌లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. మొత్తం 2800 మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్‌లు కొనసాగుతాయన్నారు. మ్యాచ్‌లకు 3 గంటల ముందు నుంచి లోపలికి పంపిస్తారన్నారు. ప్రత్యేకంగా స్టేడియంలో జాయింట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంటుందన్నారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు షీ టీమ్స్‌ ఉంటాయని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఫ్రీ పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆటగాళ్లకు, వీవీఐపీలతోపాటు ప్రేక్షకులకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలు ఉన్నాయని తెలిపారు. పాసులు కలిగిన వారు పోలీసుల సూచనల మేరకు పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలను పార్క్‌ చేయాలన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో బ్లాక్‌లో టికెట్‌ విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. టికెట్లు కలర్‌ జీరాక్స్‌ తీసుకొస్తే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు విక్రయించడం.. పార్కింగ్‌ ఫీజ్‌ వసూలు చేసినట్టు తెలిస్తే వెంటనే డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. మొబైల్‌ ఫోన్లు, బ్లూ టూత్‌లకు మినహా ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్టేడియం లోపలకు అనుమతించబోమని సీపీ తెలిపారు. ఈసారీ ఇయర్‌ ఫోన్లను అనుమతిస్తున్నట్టు స్పష్టం చేశారు. మహిళలకు పెద్దసైజు గల పర్సుల అనుమతి లేదన్నారు. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బ్యాగ్‌లు, పెన్నులు, సెంట్‌ బాటిళ్లు, శిరస్త్రానాలు, మంచినీళ్ల సీసాలు స్టేడియం లోపలకు అనుమతించేది లేదని తెలిపారు.
సీఈఓ డాక్టర్‌ పాండు రంగమూర్తి మాట్లాడుతూ.. బయటి వస్తువులను అనుమతించబోమన్నారు. సెక్యురిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఐపీఎల్‌ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు, అభిమానులు అధిక శాతం సొంత వాహనాలపై వస్తున్నారని తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలపై వస్తుండటంతో ట్రాఫిక్‌కు ఆటంకం కలుగు తోందన్నారు. ప్రజా రావాణాను ఉపయోగించుకోవాలని కోరారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో మెట్రో, ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయన్నారు.