– రాష్ట్ర డీజీపీ రవిగుప్త
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర పోలీస్ ర్ జనరల్ (డీజీపీ) రవిగుప్త ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 పార్లమెంట్, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 మంది రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 కంపెనీల సెంట్రల్ ఫోర్స్, 700 మంది ఇతర ప్రాంతాలకు చెందిన హౌం గార్డ్స్ పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 89, ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్‌పోస్ట్‌లు, 173 అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి ఒకటిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.186.14 కోట్ల మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులను పట్టుకున్నట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీ) కింద నేరాలకు సంబంధించి 8863 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసామన్నారు. ముందస్తు చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా 34,526 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. మే 12నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించు కునేలా అన్ని చర్యలు చేపట్టినట్టు డీజీపీ తెలిపారు.