రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా

– అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల పరస్పర సమన్వయ సమావేశం
– వాడపల్లి చెక్‌ పోస్ట్‌ తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ
నవతెలంగాణ -మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్రం శాసనసభ ఎన్నికల సందర్భంగా వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన సమీకత చెక్‌ పోస్ట్‌ను జిల్లా కలెక్టర్‌ అర్‌వి.కర్ణన్‌, ఎస్పీ అపూర్వ రావు, తనిఖీ చేశారు. వీరితో పాటు ఆంధ్ర రాష్ట్ర పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌, ఎస్పీ రవి శంకర్‌ రెడ్డి, అధికారులు ఉన్నారు.ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మధ్యం,నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ లు,ఎస్‌.పి.లు ఆయా శాఖల అధికారులు,సిబ్బందికి సూచించారు. బుధవారం వాడపల్లి చెక్‌ పోస్ట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.అనంతర అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు సంబంధిత ఇతర అధికారులతో వాడపల్లి పెన్న సిమెంట్‌ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్‌ హాల్‌ లో పరస్పర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర, అంతర్‌ జిల్లా సరిహద్దు ప్రవేశ ,నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, నగదు సరఫరా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఇరు రాష్ట్రాల ఇంటలిజెన్స్‌ పరస్పర సమాచారం పంచుకోవడం ద్వారా కట్టడి చేసేందుకు వీలు ఉంటుందన్నారు. దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ననుసరించి నల్గొండ జిల్లాలో వాడ పల్లి సమీకత చెక్‌ పోస్ట్‌,నాగార్జున సాగర్‌ సమీకత చెక్‌ పోస్ట్‌,సాగర్‌ టెయిల్‌ పాండ్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు,నగదు, మద్యం పంపిణీ పై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. ఇప్పటికే దాచేపల్లి మండలం పొందుగల,సాగర్‌,సత్రశాల వద్ద చెక్‌ పోస్ట్‌ లు పని చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.పరస్పర సహకారం తో సమన్వయంతో పని చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ వి.వెంకట గిరి,ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌,రవాణా శాఖ అధికారి సురేష్‌ ఇతర శాఖల తదితరులు పాల్గొన్నారు.