పార్టీ ప్రజాసంఘాల విస్తరణకై నడుం బిగించండి..

– సీపీఐ శ్రేణులకు కు దిశా నిర్దేశం చేసిన పల్లా వెంకటరెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా వ్యాపితంగా సీపీఐ పార్టీ విస్తరణకు మరియు ప్రజా సంఘాల నిర్మాణానికి సీపీఐ శ్రేణులు  ఉద్యమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం బొమ్మగాని ధర్మ బిక్షం భవన్ లో జరిగిన పార్టీ కార్యవర్గం మరియు కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో విద్యార్థి, యువజన, రైతు, వ్యవసాయ,మహిళా, కార్మిక రంగాలను విస్తరింప చేయటం  ద్వారా  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హమాలీ ట్రాక్టర్ ఆటో డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మిక రంగాలను క్షేత్రస్థాయిలో నిర్మించడం ద్వారా అనేకమంది యువ నాయకులు తయారవుతారని, జిల్లాలోని అన్ని గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయటం సులభతరం అవుతుందని ఆయన ఉద్బోధించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, కలసి రాని చోట ఇతర పార్టీలతో అవగాహన కుదుర్చుకోవాలని, సాధ్యమైనంతవరకు స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సర్పంచి ఎంపీటీసీలు గెలుచుకొని క్రియాశీలకంగా మారాలని, జూలై చివరి వరకు అన్ని మండల జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని అవసరమైన చోట కొత్త నాయకత్వాన్ని ఇముడ్చుకోవాలని, గతంలో వివిధ వామపక్ష పార్టీల్లో పనిచేసినా వారిని తిరిగి ఎర్ర జెండా దరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని తద్వారా పార్టీ బలోపేతానికి ప్రణాళికలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆగస్టు నెలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయను అని ఆగస్టు 22, 23 మరియు 24 తేదీలలో హనుమకొండలో రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పల్లా వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ సమావేశానికి యల్లావుల రాములు అధ్యక్షత వహించగా, జిల్లా సీపీఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, ఉస్తేల నారాయణరెడ్డి యల్లంల యాదగిరి, ధూళిపాళ ధనుంజయ నాయుడు, మండవ వెంకటేశ్వర్లు,కంబాల శ్రీనివాస్,బద్దం కృష్ణారెడ్డి, బత్తినేని హనుమంతరావు,పోకల వెంకటేశ్వర్లు,దేవరం మల్లీశ్వరి, అనంతుల మల్లీశ్వరి, బూర వెంకటేశ్వర్లు, ఉప్పతల కోటమ్మ, రెమిడాల రాజు, చేపూరి కొండలు తదితరులు పాల్గొన్నారు.