– అర్థ సెంచరీతో మెరిసిన హైదరాబాదీ బ్యాటర్
– రెండో టీ20లో భారత్ 152/7
నవతెలంగాణ-ప్రొవిడెన్స్
తెలుగు తేజం, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (51) అదరగొట్టాడు. వరుసగా రెండో వన్డేలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెరిశాడు. కెరీర్ రెండో టీ20లో కదం తొక్కిన తిలక్ వర్మ తొలి అర్థ సెంచరీ సాధించాడు. తెలుగు తేజం మెరుపులతో రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 152/7 పరుగులు చేసింది.
కరీబియన్లతో ధనాధన్ సవాల్‌లో మరో మ్యాచ్‌లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. పిచ్ నెమ్మదిగా ఉండటం, పేసర్ల వైవిధ్యంతో పరుగుల సాధన కష్టసాధ్యమైంది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై యువ బ్యాటర్ తిలక్ వర్మ (51, 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. తొలి టీ20లోనూ భారత్‌కు టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలక్ వర్మ.. స్లో పిచ్‌పై మళ్లీ తడాఖా చూపించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (27, 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హార్దిక్ పాండ్య (24, 18 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.
తిలక్ వర్మ షో : స్లో వికెట్‌పై టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించటంలో విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్ (7) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (1) రనౌట్‌తో భారత్ ఒత్తిడిలో పడింది. 18 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్న భారత్.. ఆ తర్వాత అంత దూకుడు చూపించలేదు. కానీ ఓ ఎండ్‌లో తిలక్ వర్మ (51) సూపర్ షో భారత్‌ను రేసులో నిలిపింది. ఇషాన్ కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసిన తిలక్ వర్మ.. భారత్‌ను మంచి స్కోరు దిశగా నడిపించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన తిలక్ వర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్ సాధించాడు. సంజు శాంసన్ (7) విఫలమైనా.. కెప్టెన్ హార్దిక్ పాండ్య (24) రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. చివర్లో అక్షర్ పటేల్ (14), అర్షదీప్ సింగ్ (6 నాటౌట్), రవి బిష్ణోరు (8 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో హోసేన్, జొసెఫ్, షెఫర్డ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : ఇషాన్ కిషన్ (బి) షెఫర్డ్ 27, శుభ్‌మన్ గిల్ (సి) హెట్‌మయర్ (బి) జొసెఫ్ 7, సూర్యకుమార్ (రనౌట్) 1, తిలక్ వర్మ (సి) మెక్‌కారు (బి) హొసేన్ 51, సంజు శాంసన్ (స్టంప్డ్) పూరన్ (బి) హొసేన్ 7, హార్దిక్ పాండ్య (బి) జొసెఫ్ 24, అక్షర్ పటేల్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 14, రవి బిష్ణోరు నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152.
వికెట్ల పతనం : 1-16, 2-18, 3-60, 4-76, 5-114, 6-129, 7-139.
బౌలింగ్: మెక్‌కారు 4-0-25-0, అకీల్ హోసేన్ 4-0-29-2, అల్జారీ జొసెఫ్ 4-0-28-2, జేసన్ హోల్డర్ 4-0-29-0, రొమారియో షెఫర్డ్ 3-0-28-2, కైల్ మేయర్స్ 1-0-12-0.