తిలక్‌ వర్మ సెంచరీ

Tilak Varma Century– ఇండియా-డితో దులీప్‌ మ్యాచ్‌
అనంతపురం: హైదరాబాదీ స్టార్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (111 నాటౌట్‌, 193 బంతుల్లో 9 ఫోర్లు) శతక మోత మోగించాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో కొనసాగిన తిలక్‌ వర్మ దులీప్‌ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-డి బౌలర్లను ఉతికారేసిన తిలక్‌ వర్మ అజేయ సెంచరీతో చెలరేగాడు. తిలక్‌ వర్మకు తోడు ఓపెనర్‌ ప్రతమ్‌ సింగ్‌ (122) సైతం శతకంతో మెరిశాడు. దీంతో ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 380/3 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (56), శశ్వాంత్‌ రావత్‌ (64 నాటౌట్‌, 88 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ 290 పరుగులు చేయగా.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. 488 పరుగుల రికార్డు ఛేదనలో ఇండియా-డి ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-డి 62/1 పరుగులతో పోరాడుతోంది. యశ్‌ దూబె (15 నాటౌట్‌), రికీ భురు (44 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. ఇండియా-డి విజయానికి మరో 426 పరుగుల దూరంలో నిలువగా.. ఇండియా-ఏ గెలుపుకు మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది.
దులీప్‌ ట్రోఫీలో ఇండియా-సి, ఇండియా-బి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బదులుగా ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 309/7 పరుగులతో పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 216 పరుగులు వెనుకంజలో నిలిచిన ఇండియా-బి… ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (143 నాటౌట్‌, 262 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌)పై ఆశలు పెట్టుకుంది. జగదీశన్‌ (70)తో కలిసి తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించిన అభిమన్యుకు మిడిల్‌ ఆర్డర్‌ నుంచి సహకారం లభించలేదు. ముషీర్‌ ఖాన్‌ (1), సర్ఫరాజ్‌ ఖాన్‌ (16), రింకూ సింగ్‌ (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2), వాషింగ్టన్‌ సుందర్‌ (13) నిరాశపరిచారు. టెయిలెండర్లు సాయి కిశోర్‌ (21), రాహుల్‌ చాహర్‌ (18 నాటౌట్‌)తో కలిసి అభిమన్యు పోరాటం కొనసాగించాడు. అభిమన్యు క్రీజులో ఉండటంతో ఇండియా-బి నేడు ఉదయం సెషన్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయటంపై దృష్టి సారించనుంది. దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లకు నేడు ఆఖరు రోజు ఆట.