– ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్
హాంగ్జౌ : 2023 ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్లోకి టీమ్ ఇండియా అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమ్ ఇండియా ఏకపక్ష విజయం నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 96/9 పరుగులకే కట్టడి చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని మనోళ్లు 9.2 ఓవర్లలోనే ఛేదించారు. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. పసిడి పోరుకు చేరుకుంది. నేడు అఫ్గనిస్థాన్‌తో గోల్డ్ మెడల్ కోసం పోటీపడనుంది.
తెలుగు తేజం తిలక్ వర్మ (55 నాటౌట్, 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) డకౌట్‌గా నిష్క్రమించగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్, 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో జతకట్టిన తిలక్ వర్మ.. రెండో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించాడు. రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగిన తిలక్ వర్మ.. అర్థ సెంచరీతో సత్తా చాటాడు. ఇక అంతకుముందు సాయి కిశోర్ (3/12), వాషింగ్టన్ సుందర్ (2/15) మెరవటంతో బంగ్లాదేశ్ చతికిల పడింది. ఓపెనర్ ఎమాన్ (23), వికెట్ కీపర్ జాకర్ అలీ (24) మాత్రమే బంగ్లాదేశ్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.