తిలా పాపం తలా పిడికెడు !

Tila sin head fist !– ఆ కంపెనీల నుంచి అన్ని పార్టీలకూ విరాళాలు
– తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా విరివిగా బాండ్ల కొనుగోలు
– పీఎంఎల్‌ఏను ఉల్లంఘించాయని చెప్పిన ఆర్థిక శాఖ
– లబ్దిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌, బీఆర్‌ఎస్‌, బీజేడీ
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్‌ఏ) ఉల్లంఘించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలుగా 2018లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్ర వేసిన సంస్థలు బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించాయి. బాండ్లకు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన తాజా సమాచారం ఈ విషయాన్ని బయటపెట్టింది. 2018లోనే కాదు…2019, 2021, 2022 సంవత్సరాల్లో కూడా ఆర్థిక శాఖ జాబితాలో ఉన్న ఈ తరహా కంపెనీ ఒకటి బీజేపీకి విరాళాలు అందజేసింది. మొత్తం 9,491 బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థల్లో 19 సంస్థలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆర్థిక శాఖను ఉటంకిస్తూ ఈ నెల 14న ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. వీటిలో 16 కంపెనీల కార్యాలయాలు ఒక్క కొల్‌కతాలోనే ఉన్నాయి. షెల్‌ కంపెనీలకు అడ్డాగా ఉన్న కొల్‌కతాలోని లాల్‌ బజార్‌ వంటి ప్రదేశాల్లో కొన్ని సంస్థల చిరునామాలు ఉండడం గమనార్హం.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే ఈ 19 కంపెనీల్లో ఏకంగా 18 కంపెనీల పేర్లు ఆ తర్వాతి కాలంలో ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) వార్షిక జాబితా నుండి అదృశ్యమయ్యాయి. ఒక్క కంపెనీ పేరు మాత్రమే 2022 వరకూ ఆ జాబితాలో కొనసాగింది. ఎఫ్‌ఐయూ జాబితా ప్రకారం తీవ్రమైన ఇబ్బందులు ఎదురొన్న బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి…
టీఎంసీ, కాంగ్రెస్‌ కోసం…
బన్సాల్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కాంగ్రెస్‌ పార్టీ కోసం 2022 జనవరి 3న రూ.50 లక్షల బాండ్లు కొనుగోలు చేసింది. క్లిక్స్‌ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా అదే తేదీన కాంగ్రెస్‌ కోసమే రూ.35 లక్షల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. క్రోచెట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2021 అక్టోబర్‌ 8న, 2023 జూలై 7న బాండ్లు కొన్నది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.2 కోట్లు, ఆ పార్టీకే మరో రూ.1.5 కోట్లు విరాళంగా అందించింది. జ్యూపిటర్‌ మర్చంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2019 ఏప్రిల్‌ 17న రూ.25 లక్షల బాండ్లు కొన్నది. అయితే ఈ మొత్తం ఏ పార్టీకి చేరిందీ తెలియరాలేదు. లైఫ్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు కోటి రూపాయల చొప్పున బాండ్ల ద్వారా విరాళాలు అందించింది.
మను వ్యాపార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బీజేడీ కోసం రూ.2 కోట్లు, కాంగ్రెస్‌ కోసం రూ.2 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం రూ.1 కోటి విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. ప్లూటో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ 2021 జూలై 6న రూ.24 లక్షల విలువైన బాండ్లను కొన్నది. ఈ ఏడాది జనవరి 24న మరో రూ.25 లక్షల బాండ్లు కొనుగోలు చేసింది. ఆ మరునాడే రూ.50 లక్షల బాండ్లను కొన్నది. ఈ సొమ్మంతా తృణమూల్‌ జేబులోకే వెళ్లింది. రామోలీ డీలర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కాంగ్రెస్‌ పార్టీ కోసం 2022 జనవరి 3న రూ.25 లక్షల బాండ్లు కొనుగోలు చేసింది. రాణీ సతి మర్కంటైడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2021 అక్టోబర్‌ 5న రూ.30 లక్షలు, ఈ ఏడాది జనవరి 6న రూ.75 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌కు విరాళంగా సమర్పించుకుంది.
బీఆర్‌ఎస్‌ ఖాతాలో కూడా…
రైట్‌ ఎయిడ్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2021 అక్టోబర్‌ 8న తృణమూల్‌ కోసం రూ.1.5 కోట్లు, 2023 జూలై 10న బీఆర్‌ఎస్‌ కోసం రూ.1.5 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. సిల్వర్‌టోన్‌ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తృణమూల్‌ కోసం రూ.2 కోట్లు, బీజేడీ కోసం రూ.1.2 కోట్లు, బీఆర్‌ఎస్‌ కోసం రూ.30 లక్షల విలువ కలిగిన బాండ్లను కొన్నది. శ్రీనాథ్‌ ఫిన్వెస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2021 జూలై 7న రూ.10 లక్షలు, 2022 జనవరి 7న రూ.20 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేసి కాంగ్రెస్‌కు అందజేసింది. సుధా కమర్షియల్‌ కంపెనీ లిమిటెడ్‌ 2019 ఏప్రిల్‌ 20న రూ.30 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఏ పార్టీ కోసం కొన్నదీ తెలియలేదు. శ్వేత ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బీజేపీ కోసం 2019 ఏప్రిల్‌ 16న రూ.2 కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది.
చిరునామా సేమ్‌
తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీల్లో ఏబీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఒకటి. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇదే పేరున్న (ఏబీసీ ఇండియా లిమిటెడ్‌) కంపెనీ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. 2019 ఏప్రిల్‌ 12న ఈ కంపెనీ బీజేపీ కోసం రూ.40 లక్షల బాండ్లు కొన్నది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న పత్రాల ప్రకారం ఏబీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఏబీసీ ఇండియా లిమిటెడ్‌ కంపెనీల చిరునామాలు ఒకటే. ఈ రెండింటిలోనూ ఉమ్మడి డైరెక్టర్‌ ఉన్నారు.
ఎన్నికల సమయంలో…
అరిహంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 2019 ఏప్రిల్‌ 12న బీజేపీ కోసం రూ.40 లక్షల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసిన మరునాడే ఈ లావాదేవీ జరిగింది. అశిష్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం రూ.5 కోట్లు, బీజేపీ కోసం రూ.2 కోట్ల విలువైన బాండ్లు కొన్నది. ఆతమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ 2022 ఏప్రిల్‌ 7న రూ.10 కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. గత సంవత్సరం జనవరి 24న ఈ కంపెనీ మరోసారి రూ.15 కోట్ల బాండ్లు కొన్నది. 2022-23 మధ్యకాలంలో ఈ సంస్థ మొత్తం రూ.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ సొమ్మంతా బీజేపీ ఖాతాకే చేరింది.
విరాళాలు ఇచ్చింది ఈ కంపెనీలే
రేణుక ఇన్వెస్ట్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ 2019 ఏప్రిల్‌ 12న బీజేపీ కోసం రూ.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కామ్నా క్రెడిట్స్‌ అండ్‌ ప్రమోటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2022 జనవరి 4న కాంగ్రెస్‌ కోసం రూ.11.5 కోట్లు, బీఆర్‌ఎస్‌ కోసం రూ.7 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం రూ.6 కోట్లు, బీజేడీ కోసం రూ.5 కోట్లు, బీజేపీ కోసం రూ.1 కోటి విలువైన బాండ్లు కొన్నది. ఇన్నోసెంట్‌ మర్చండైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2019 ఏప్రిల్‌ 12న తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం రూ.25 లక్షల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. ఆల్‌మైటీ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసమే 2019 జూలై 5న రూ.30 లక్షల
బాండ్లు కొన్నది.