మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

Till now, the center has been thrashed. Now the CM is speechless– కార్మికపక్షంపై నిరంకుశత్వం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘మొన్నటివరకు కేంద్రంలోని బీజేపీని దునుమాడిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు దాని వైఖరి మార్చుకుని వారి పంచన చేరినట్టుగా కనిపిస్తోంది.. బీజేపీని సంతృప్తి పరిచే చర్యలకు పూనుకుంటూ కార్మికవర్గంపై నిరంకుశపోకడ అవలంబిస్తోంది.. నిర్బంధాలకు దిగుతోంది.. అండగా నిలిచిన ఎర్రజెండా నేతలను సంఘ విద్రోహశక్తుల మాదిరిగా కోర్టుల ద్వారా బహిష్కరణ వేటు వేయిస్తోంది. ప్రజాసామ్యబద్ధంగా చర్చలకు రాకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్‌ మిశ్రా భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటివరకూ ప్రధాని మోడీపైనా, కేంద్రంలోని బీజేపీపైనా, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకున్నట్టుగా కనిపిస్తోందన్నారు. వంటగ్యాస్‌ మొదలు బియ్యం, పప్పులు, పెట్రో, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుడు బతకడమే కష్టంగా కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తోందన్నారు.
రాష్ట్రంలోని 73షెడ్యుల్‌ విభాగాల కింద ఉన్న కోటిమంది కార్మికుల కనీస వేతన చట్టం పునర్నిర్మాణం ఉమ్మడి రాష్ట్రం నుంచి 15ఏండ్లుగా అటకెక్కిందని చెప్పారు. ఐదేండ్లకోమారు సవరణ చేయాల్సిన కనీస వేతన చట్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్కీం వర్కర్లు, పంచాయతీ కార్మికులకు మాట ఇచ్చి మరిచిపోయిందన్నారు. అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే వారి కేంద్రాల తాళాలను అధికారులతో పగలగొట్టించి మరీ దొంగలా వ్యవహరిస్తోందన్నారు. సమ్మె విరమించి అడుక్కుంటే సరి.. లేదంటే నిర్బంధం తప్పదని సూచిస్తున్న ముఖ్యమంత్రి తన దయాదాక్షిణ్యాలతో భిక్ష వేస్తున్నాడా? అని ప్రశ్నించారు.
డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం ఎదురుచూసి వేసారిన ఇండ్లులేని నిరుపేదలు.. 19 జిల్లాల్లో 66 కేంద్రాల్లో సుమారు లక్షకుపైగా మంది గుడిసెలు వేసుకుని 17 నెలలుగా భూపోరాటం చేస్తున్నారని చెప్పారు. హక్కుల కోసం, కనీస వేతనాల కోసం సమ్మె చేస్తున్న వారిపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని, వారికి అండగా నిలిచిన ఆదిలాబాద్‌ జిల్లా సీపీఐ(ఎం), సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులను రిమాండ్‌ చేసిందని తెలిపారు. వాళ్లేమైనా రౌడీలా..? సంఘవిద్రోహ శక్తులా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా రంగాల్లో యూనియన్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి కార్మిక సమస్యలు పరిష్కరించాలని, లేదంటే కార్మికపక్షాన ఎర్రజెండాలే ప్రభుత్వాన్ని ఢకొీంటాయని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, వర్ణ వెంకట్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సంపత్‌, ఎడ్ల రమేష్‌ ఉన్నారు.