కాలం కుదుపులకు లోనయ్యిందేమో..
నడుస్తూ ఉన్నప్పుడు
నిత్యం పొలమారుతూనే ఉంది
గతాన్ని నెమరు వేసుకుంటూ
నిట్టూర్పులు విడుస్తూనే ఉంది
పలకరింపులకై పరితపిస్తూ
ఆత్మీయతకై అలమటిస్తూ
ఎక్కడోగాని రాని, మట్టి వాసనకై
వెతుకులాడుతూనే ఉంది
అత్తరు సొబగుల్లో మాయమైన
చెమట చుక్కల సౌందర్యాన్ని
కాసుల గలగలలో వినిపించని
కేరింతల సుమగంధాల జాడను
వెతుక్కుంటూ నడుస్తూనే ఉంది
ఎవరి పన్నాగమో..!
పట్టణ పుట్టల కింద విలవిలలాడుతున్న
పల్లెల శిధిలాలను తడుముకుంటూ
అభివద్ధి చక్రాల కింద అనిగిపోయిన!
చేను మొనలను నిమురుకుంటూ
కాలం కుంటుతూనే నడుస్తూ ఉంది
పూర్వీకుల పాదముద్రలు పసిగడుతూ
తప్పిపోయిన త్రోవను
వెతుక్కుంటూనే ముందుకెళ్తూ
– వినోద్ కుత్తుం, 9634314502న