– 8న ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన
– రూ.2వేల కోట్లు.. 5.5 కిలో మీటర్లు
– ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో రైలు రెండో దశ నిర్మాణ పనులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8న మెట్రో రైలు రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులను ప్రారంభించనున్నారు. ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో మొత్తం నాలుగు స్టేషన్లు ఉంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ. 2వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కాగా, మెట్రో ప్రయాణం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రూట్ మ్యాప్‌లను ఖరారు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించే 5.5 కి.మీ కారిడార్ అందుబాటులోకి వస్తే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్‌నుమా చేరుకోవచ్చు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8వ తేదీన (శుక్రవారం సాయంత్రం) పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ అలైన్‌మెంట్ దారుల్‌షిఫా- పురానిహవేలి- ఎటెబార్‌చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – షమ్‌షీర్‌గంజ్ – అలియాబాద్ గుండా వెళ్తుందని, ముందుగా అనుకున్నట్టుగానే ఫలక్‌నుమా మెట్రో రైలు స్టేషన్‌లో ముగుస్తుందని ఎండీ తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా నాలుగు స్టేషన్లు ఉంటాయని, అలైన్‌మెంట్, స్టేషన్‌లు స్మారక చిహ్నాలకు దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా రెండు స్టేషన్‌లకు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ పేరు పెట్టినట్టు వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వరకు, స్టేషన్ స్థానాల్లో 120 అడుగుల వరకు రోడ్డు విస్తరణలో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయని, ఈ ప్రాజెక్టుకు రోడ్డు విస్తరణ, వినియోగాల తరలింపుతో కలిపి దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు కానుందని ఎండీ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన విధంగా రోడ్డు విస్తరణలోగానీ, మెట్రో రైలు నిర్మాణంలోగానీ ఈ ప్రాంతంలో ఎలాంటి మతపరమైన లేదా వారసత్వ కట్టడాలు దెబ్బతినకుండా ఉండేలా ఇంజినీరింగ్ పరిష్కారాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ లైన్‌ను ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కి.మీ మేర పొడిగించనున్నట్టు వివరించారు. ఇది నాగోల్-ఎల్‌బీ నగర్-చాంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి -పీ7 రోడ్- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల కొత్త ఎయిర్‌పోర్ట్ లైన్‌లో ప్రధాన ఇంటర్‌చేంజ్ స్టేషన్‌గా అభివృద్ధి అవుతుందని తెలిపారు.