ఏటూరి నాగేంద్ర సీనియర్ కవి. చాలా తక్కువ పంక్తుల్లో మేలిమి అయిన కవిత్వం రాయటం వీరి ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో వీరు ప్రచురించిన కవితాసంపుటి ‘కలల కార్ఖానా’. వారు తాత్వికత ధోరణిలో రాసిన ‘సముద్రానికావల’ కవితను పరిశీలిద్దాం.
గూడు చక్కగా ఉన్నంతసేపు పక్షులు కిలకిలమంటూ నవ్వుతూ ఉంటాయి. బయట నుండి కూడా పక్షులొచ్చి తోడుగా నిలుస్తాయి. ఆ గూడు చెడిపోయినప్పుడు ఏ పక్షీ రాదు. పైగా విమర్శలను గుప్పిస్తాయి. జీవితంలో ఇలాంటి సందర్భాలెన్నో. అలాంటి శకలాల్లోంచి రాలిపడ్డ కవితే ‘సముద్రానికావల’. కవి ‘జీవితం’ గురించి ఎత్తుగడలోనే తెలియజేస్తూ ‘గడిచిపోతూనే ఉంది’ అని మొదలు పెట్టాడు. దాంట్లోని అర్థం జీవితం ఎవరి కొరకు వేచి చూడదని. జీవితం గడుస్తున్న కొద్ది చాలా అనుభవాలను పొందాల్సి ఉంటదని కూడా.
చాలామంది రూల్స్ ఇతరుల కోసం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. తమ విషయానికి వచ్చేసరికి ఏవేవో నీతి సూత్రాలు చెబుతుంటారు. అవసరమొస్తే ఇతర వ్యక్తుల మీదకు మాటల తూటాలు వదులుతారు. వారి గూర్చి చులకనగా కూడా మాట్లాడతారు. వీటన్నింటినీ కవి ఎంతో పరిశీలించి రాసినట్టుంది. అందుకోసమనే నీతి సూత్రాలన్నీ అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటున్నాయని రాయగలిగారు.
కవి వస్తు నిర్వహణలో వాడిన పదం ‘నాకు నేను అర్థం కాక’ అనేది ఎంతో లోతైన ఆలోచనలోంచి పుట్టినది. ఈ సమాజంలో క్రమశిక్షణతో బ్రతికేవారు, ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఖచ్చితంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే వాళ్లకు వాళ్ళు అసలే అర్థం కారు. ఎందుకంటే తాము చేస్తున్నది తప్పా? సరైనదా? అని తెలుసుకోలేనంతగా అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి కాబట్టి.
మనిషికి విలువ దొరికేది బ్రతికున్నప్పుడు కాదు చనిపోయిన తర్వాత. మనుషులు మాట్లాడుకునే నాలుగు మంచి మాటలతోనే తను ఏ స్థానంలో ఉన్నదీ తెలిసేది. ఈ కవితలో కవి ఆవేదనంతా అదే. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుందంటారు కదా! కవి అందుకే రోజులను లెక్కిస్తున్నాను అని ఓ తాత్వికత సందర్భంలోంచి నిజాలు తెలిసినవాడిగా సమాజం మీద ఉన్న బెంగతో మాట్లాడుతున్నాడు.
‘జీవితం’ గురించిన ప్రశ్న వేస్తూ ఇది అర్థం కాని విషయమా? అని పాఠకులను అప్రమత్తం చేస్తున్నాడు. నిజానికి జీవితం చిక్కువీడని ప్రశ్నల పరంపర. ఒక సమస్య పూర్తి కాకముందే ఇంకో సమస్య వరుసకట్టి మన వైపుకు నడుచుకుంటూ వస్తుంది. ఇవన్నీ తెలిసిన వాడుగానే కవి ఆ ప్రశ్న వేశాడు. అందుకే ఈ వైపు నుండి ఇంకో వైపుగా అడుగులు వేద్దామని నిశ్చయించుకున్నారు. అందుకోసమనే ఈ కవితలో తత్వగీతాన్ని ఎత్తుకున్నారు. స్వార్థం విడనాడాలంటే మనుషులంతా ఇప్పుడు ఆ గీతాలకు కోరస్ పలకాల్సిన సమయమిది. జీవితం గుట్టును తెలుసుకొని కలిసిమెలిసి ఉండాల్సిన తరుణమిది. కవి ఎంచుకున్న దారిలో అడుగులు పడాల్సిన సందర్భం ఇది.
సముద్రానికావల
జీవితం గడిచిపోతూనే ఉంది
ఒక్కోసారి హేళనగా! మరోసారి చులకనగా!
నీతి సూత్రాలన్నీ అద్దంలో చూసుకుంటూ నవ్వుకొంటున్నాయి.
నాకు నేను అర్థం కాక,
తాళం చెవిని ఎక్కడో విసిరి పారేశాను.
మార్చురీలో…
మరణానంతర సన్నివేశం కోసం
నా శవం గంటల్నీ రోజుల్నీ లెక్కిస్తోంది.
ఘనీభవించిన కన్నీటితో
ఏడేడు సముద్రాల్ని దాటుతున్న రక్తం.
నాకొకటి అర్థంకావడం లేదు…
అర్థం కాని లోపభూయిష్టమైన
కళాఖండమా ఈ జీవితం?
అటునుంచి ఎవరో తత్వం పాడుతున్నారు.
-ఏటూరి నాగేంద్రరావు
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551